Page Loader
Double bedroom: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కొత్త ప్రణాళిక ..!
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కొత్త ప్రణాళిక ..!

Double bedroom: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కొత్త ప్రణాళిక ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

గత ప్రభుత్వ హయాంలో నిర్మించి కేటాయించని రెండు పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2 జాబితాలో ఉన్న లబ్ధిదారులకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఇటీవల పూర్తయిన ఇంటింటి కులగణన సర్వే డేటాతో దీనిని పోల్చి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 అనే మూడు విభాగాలుగా విభజించింది. ఎల్-1 జాబితా: సొంత స్థలం కలిగిన 21.93 లక్షల మంది లబ్ధిదారులను చేర్చారు. వీరికి ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం దశల వారీగా రూ.5 లక్షలు అందించనుంది.

వివరాలు 

మిగిలినవి కేటాయించాలని.. 

ఎల్-2 జాబితా: సొంత స్థలం లేని 19.96 లక్షల మంది లబ్ధిదారులను ఇందులో చేర్చారు. వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వనుంది. ఎల్-3 జాబితా: ఇప్పటికే ఇల్లు కలిగి ఉన్నవారు, కానీ దరఖాస్తు చేసుకున్న వారు ఇందులో చేరారు. గత ప్రభుత్వ హయాంలో 2.36లక్షల రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయగా,1.58లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. కానీ,వాటిలో 1.36లక్షల ఇళ్లకే లబ్ధిదారులను ప్రకటించారు. మిగిలిన ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు గుత్తేదారులతో సంప్రదింపులు జరిపి పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని యోచిస్తోంది. మిగిలిపోయిన ఇళ్లను ఎల్-2 జాబితాలో ఉన్న వారికి కేటాయిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది.

వివరాలు 

క్షేత్రస్థాయి పరిశీలన, గ్రామసభలు 

ప్రతి నియోజకవర్గంలో పూర్తయిన, మధ్యలో నిలిచిపోయిన ఇళ్ల జాబితాను ప్రభుత్వం సేకరించింది. కొన్నిచోట్ల లబ్ధిదారుల పేర్లు ప్రకటించినా, ఇంకా ఇళ్ల కేటాయింపు జరగలేదు. క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన చేసి, అర్హులైన వారికి కేటాయింపు చేయనున్నారు. స్థలంతోపాటు రూ.5 లక్షలు తీసుకోవడం కన్నా, సిద్ధంగా ఉన్న ఇల్లు పొందడం మేలని భావిస్తున్న లబ్ధిదారులు, తమకే కేటాయించాలని రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే, ప్రభుత్వం గ్రామసభలు ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది.