Loading...
PM Modi: మోదీ మెచ్చిన కడప రైతు.. యూట్యూబ్‌ చూసి అవకాడో సాగు, అదిరిపోయే సక్సెస్‌!
మోదీ మెచ్చిన కడప రైతు.. యూట్యూబ్‌ చూసి అవకాడో సాగు, అదిరిపోయే సక్సెస్‌!

PM Modi: మోదీ మెచ్చిన కడప రైతు.. యూట్యూబ్‌ చూసి అవకాడో సాగు, అదిరిపోయే సక్సెస్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా కరవు ప్రాంతంగా, పరిమిత పంటల సాగుకే అనుకూలంగా పేరున్న కడప జిల్లా పులివెందుల నుంచి ఓ యువ రైతు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ వినూత్న పంటను సాగు చేసి విజయాన్ని సాధించిన ఆయనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రశంసించారు. ఇటీవల ప్రసారమైన 137వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని ఈ రైతు విజయగాథను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో కడప జిల్లాకు చెందిన 30 ఏళ్ల కర్ప వరదరాజ్ పేరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

వివరాలు

సంప్రదాయ పంటల నుంచి అవకాడో వైపు..

పులివెందులకు చెందిన వరదరాజ్ తన తల్లి, భార్య ప్రమీల, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.

2022 వరకు వారి కుటుంబం సంప్రదాయ పద్ధతిలో టమాటా, అరటి పంటలను సాగు చేసేది. అయితే ఆ ఏడాది పంట సరిగ్గా పండకపోవడంతో పాటు మార్కెట్లో ధరలు కూడా భారీగా పడిపోయాయి.

దీంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ఈ అనుభవం వరదరాజ్‌ను ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచించేలా చేసింది.

కొత్త పంటలపై సమాచారం కోసం ఆయన యూట్యూబ్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో అవకాడో సాగు గురించి తెలుసుకున్నారు.

దాని గురించి మరింత శాస్త్రీయ పరిజ్ఞానం పొందేందుకు కర్ణాటకకు వెళ్లి అక్కడి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.

వివరాలు

మొదట్లో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు

అయితే అవకాడో సాగు చేయాలన్న ఆయన నిర్ణయాన్ని తొలుత కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. సంప్రదాయ పంటలనే కొనసాగించాలని సూచించారు.

అయినప్పటికీ వరదరాజ్ వెనక్కి తగ్గలేదు. "సంప్రదాయ పంటలనే కొనసాగించమని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ నేను ధైర్యం చేసి నాలుగేళ్ల క్రితం నా పొలంలో అవకాడో మొక్కలు నాటాను.

ఈ ఏడాది మార్చి నుంచి పంట చేతికి రావడం ప్రారంభమైంది. డబ్బులు కూడా రావడంతో మా కుటుంబంలో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది" అని వరదరాజ్ తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

నాలుగు టన్నుల అవకాడో దిగుబడి

ఇప్పటివరకు వరదరాజ్ తన పొలంలో దాదాపు నాలుగు టన్నుల అవకాడో పండించారు. వాటిని స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.

మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

అయితే తన వ్యవసాయ ప్రయాణంలో అన్నింటికంటే పెద్ద ఆనందాన్ని ఢిల్లీ నుంచి అందుకున్నానని వరదరాజ్ చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పేరు, తన ప్రయత్నాన్ని 'మన్ కీ బాత్'లో ప్రస్తావించడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.

"ప్రధాని నన్ను గుర్తించడంతో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థుల మధ్య నాకు ఎంతో గుర్తింపు వచ్చింది" అని వరదరాజ్ ఆనందం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

కొత్త పంటలతో కొత్త అవకాశాలు

భారత్‌లో ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో అవకాడో వంటి పండ్లకు మార్కెట్లో డిమాండ్‌ పెరుగుతోందని వివరించారు.

వరదరాజ్‌ వంటి వినూత్న ఆలోచనలు కలిగిన రైతులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు.

సంప్రదాయ పంటలకు బదులుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త పంటలను సాగు చేయడం ద్వారా రైతులు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు.

వరదరాజ్ సాధించిన విజయం గ్రామీణ భారతదేశంలో దాగి ఉన్న కొత్త అవకాశాలకు నిదర్శనమని ప్రధాని మోదీ కొనియాడారు.

ADVERTISEMENT