Amaravati: అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణంలో కీలక అడుగు.. నాలుగు ప్యాకేజీలుగా పనులు
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మాణాన్ని నాలుగు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. మొత్తం 189.93 కి.మీ. మేర ఆరు వరుసలతో ఓఆర్‌ఆర్‌ను నిర్మించడంతోపాటు.. నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.2 కి.మీ. మేర నాలుగు వరుసల అనుసంధాన రహదారి (స్పర్ రోడ్డు)ను కూడా నిర్మించనున్నారు. దీంతో ఓఆర్‌ఆర్, స్పర్ రోడ్డు కలిపి మొత్తం 195.13 కి.మీ. మేర రహదారి నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా విభజిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ప్రతిపాదనలు పంపారు. కృష్ణా నదిపై రెండు ప్రాంతాల్లో నిర్మించనున్న వంతెనలు, మూడు సొరంగాలతోపాటు ఇతర నిర్మాణ పనులన్నింటినీ ఈ నాలుగు ప్యాకేజీల్లోనే చేపట్టేలా ప్రతిపాదించారు.
వివరాలు
మొదటి ప్యాకేజీ చిన్నది
గతంలో సగటున 25-30 కి.మీ.కు ఒక ప్యాకేజీ చొప్పున మొత్తం ఆరు నుంచి ఎనిమిది ప్యాకేజీలుగా విభజించాలని భావించారు. అయితే ప్యాకేజీల సంఖ్యను తగ్గించాలని ఉన్నతాధికారుల నుంచి సూచనలు రావడంతో.. చివరకు నాలుగు ప్యాకేజీలుగా విభజించారు.
ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల సమీపంలో విజయవాడ-హైదరాబాద్ హైవే వద్ద నుంచి అమరావతి ఓఆర్‌ఆర్ 0 కి.మీ. వద్ద ప్రారంభమవుతుంది.
అక్కడి నుంచి కొండపల్లి, పంగిడి అటవీ ప్రాంతాల మీదుగా మైలవరం సమీపంలోని 27వ కి.మీ. వరకు మొదటి ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్యాకేజీలో 2.68కి.మీ., 1.64కి.మీ. పొడవుతో రెండు సొరంగాలు నిర్మించనున్నారు.
ఓఆర్‌ఆర్ చివరి భాగంలో 189వ కి.మీ. నుంచి 189.93 కి.మీ. వరకు ఉన్న 930 మీటర్ల పనులను కూడా మొదటి ప్యాకేజీలోనే చేర్చారు.
వివరాలు
రెండో ప్యాకేజీ 56 కి.మీ.
రెండో ప్యాకేజీ 27వ కి.మీ. నుంచి ప్రారంభమై.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను సమీపంలోని 83వ కి.మీ. వరకు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీ మొత్తం 56 కిలోమీటర్ల మేర ఉంటుంది.
మూడో ప్యాకేజీలో స్పర్ రోడ్డు, భారీ వంతెన
మూడో ప్యాకేజీ 83వ కి.మీ. నుంచి ప్రారంభమై.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట సమీపంలోని 133.5వ కి.మీ. వరకు ఉంటుంది.
ఇందులో 50.5 కి.మీ. మేర ఓఆర్‌ఆర్ నిర్మాణంతోపాటు.. నారాకోడూరు నుంచి బుడంపాడు వరకు 5.2 కి.మీ. పొడవైన అనుసంధాన రహదారిని నిర్మిస్తారు.
ఇదే ప్యాకేజీలో కృష్ణా నదిపై వల్లూరుపాలెం వద్ద 4.8 కి.మీ. మేర వంతెన నిర్మించనున్నారు.
వివరాలు
నాలుగో ప్యాకేజీలో మరో వంతెన, సొరంగం
నాలుగో ప్యాకేజీ 133.5వ కి.మీ. వద్ద ప్రారంభమై.. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలోని 189వ కి.మీ. వరకు కొనసాగుతుంది.
ఈ ప్యాకేజీ మొత్తం 55.5 కి.మీ. మేర ఉంటుంది. ఇందులో పేరేచర్ల వద్ద 400 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించనున్నారు.
అలాగే మున్నలూరు వద్ద కృష్ణానదిపై 3.15 కి.మీ. మేర వంతెన నిర్మిస్తారు.
వివరాలు
రూ.30,491 కోట్ల అంచనా వ్యయం
అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.30,491 కోట్లుగా ఉంది. ఇందులో నాలుగు ప్యాకేజీల్లో చేపట్టే సివిల్ పనులకు కలిపి రూ.10,595.70 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
భూసేకరణ కోసం రూ.5,315 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. పర్యావరణ, అటవీ అనుమతులు, విద్యుత్ లైన్లకు సంబంధించిన వ్యయాలతోపాటు.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో 15 ఏళ్లపాటు వడ్డీతో సహా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
ఈ అంశాలకు సంబంధించిన ఖర్చులు కూడా ప్రాజెక్టు మొత్తం వ్యయంలో భాగంగా ఉంటాయి.