గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ
మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తిని మంగళవారం అర్థరాత్రి పోలీసలు అరెస్టు చేశారు. మూత్ర విసర్జనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజాసంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవయ్యాయి. శుక్లాపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఈ ఘటన ఆరు రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
మూత్ర విసర్జన ఘనటపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించారు. జాతీయ భద్రతా చట్టం కింద ప్రవేశ్ శుక్లాపై అభియోగాలు మోపాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నిందితుడు బీజేపీ కి చెందిన వాడని కొందరు అంటున్నారని విలేకరులు అడిగినప్పుడు చౌహాన్ ఇలా స్పందించారు. నేరస్థులకు కులం, మతం, పార్టీ లేదని, నేరస్థుడిని నేరస్థుడిలాగే చూస్తామని, అతడిని విడిచి పెట్టేబోమని పేర్కొన్నారు. ప్రవేశ్ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీరిద్దరి ఫోటోను శుక్లా ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అయితే దీనిపై కేదార్ స్పందించారు. ప్రవేశ్‌తో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.