15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు
కేవలం 15గంటల్లోనే దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణించి ఓ వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. దిల్లీకి చెందిన శశాంక్ మను అనే వ్యక్తి దిల్లీలోని మొత్తం 286మెట్రో స్టేషన్లను కేవలం 15గంటల 22నిమిషాల 49 సెకన్లలో ప్రయాణించినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. వాస్తవానికి మను ఏప్రిల్ 2021లో ఈ ఫీట్‌ని సాధించాడు. అయితే రెండేళ్ల తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అతనికి సర్టిఫికేట్ అందజేసింది. శశాంక్ మను ఒక ఫ్రీలాన్స్ పరిశోధకుడిగా, యాత్రికుడిగా ఉన్నారు. 2021లోనే మనుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చొటు దక్కాల్సింది. కమ్యూనికేషన్ సమస్య వల్ల 16గంటల రెండు నిమిషాల సమయంలో అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రఫుల్ సింగ్‌కు అవార్డును అందుకున్నారు.
ప్రతి స్టేషన్‌లో వీడియో తీసిన శశాంక్ మను
తనకు జరిగిన అన్యాయాన్ని గురించి తెలుసుకున్న శశాంక్ మను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులను సంప్రదించే ప్రయత్నం చేశాడు. ఇందుకోసం అతనికి నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు గిన్నిస్ నిర్వాహకులను కలిసిన తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. తాను 15 గంటల్లోనే అన్ని మెట్రో స్టేషన్లను చుట్టొచ్చానని, కానీ ప్రఫుల్ సింగ్‌కు 16గంటల సమయం పట్టిందని మను పేర్కొన్నారు. రైలు తలుపులు తెరిచే, మూసివేసే సమయాలతో సహా మొత్తం పర్యటన అన్‌కట్ వీడియోను కూడా మను తీశారు. ఏప్రిల్ 14న ఉదయం 5:00 గంటలకు బ్లూ లైన్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన మను, బ్రిగేడియర్ హోషియార్ సింగ్ మెట్రో స్టేషన్ వద్ద గ్రీన్ లైన్‌లో రాత్రి 8:30 గంటలకు ముగించాడు.