LOADING...
Revanth Reddy: హైదరాబాద్‌కు కొత్త రూపు.. సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా ప్రణాళికలు
హైదరాబాద్‌కు కొత్త రూపు.. సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా ప్రణాళికలు

Revanth Reddy: హైదరాబాద్‌కు కొత్త రూపు.. సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా ప్రణాళికలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2026
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆధునికీకరణ, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్ మగుంట శ్రీనివాసులు రెడ్డి, సీఎస్ రామకృష్ణ రావుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

వివరాలు

త్రీ-లెవెల్ ట్రాఫిక్ వ్యవస్థను అమలు చేయాలి

అండర్‌పాస్‌లు, సర్ఫేస్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లతో కూడిన త్రీ-లెవెల్ ట్రాఫిక్ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని, మల్టీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం అత్యవసరమని స్పష్టం చేశారు. పార్కింగ్ సమస్యలను అధిగమించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. అలాగే అభివృద్ధిని "క్యూర్, ప్యూర్, రేర్" అనే మూడు విభాగాలుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

వివరాలు

వ్యవసాయ రంగ అభివృద్ధికి కేటాయింపు

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని "క్యూర్" ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా గుర్తించామని, ఓఆర్‌ఆర్ బయట - ఆర్‌ఆర్‌ఆర్ లోపల ఉన్న "ప్యూర్" ప్రాంతాన్ని తయారీ రంగ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ బయట ఉన్న "రేర్" ప్రాంతాన్ని వ్యవసాయ రంగ అభివృద్ధికి కేటాయించినట్లు వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం "తెలంగాణ రైజింగ్-2047" మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement