Musi River: మూసీకి కొత్త రూపం.. బాపూఘాట్ వద్ద గాంధీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరానికి మూసీ నది త్వరలో కొత్త అందాన్ని తీసుకురానుంది. నిరంతరం మంచినీటి ప్రవాహం, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణంతో మూసీ నది ప్రత్యేక ఆకర్షణగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పక్షుల కిలకిలారావాలు, పడవల సందడి, చిన్నారుల ఆటపాటలతో నదీ పరీవాహక ప్రాంతం కొత్త రూపాన్ని సంతరించుకోనుంది. నదికి ఇరువైపులా విశాలమైన రహదారులు, నది పొడవునా ఆకర్షణీయమైన పార్కులు, ఆకాశహర్మ్యాలు నిర్మించనున్నారు. అలాగే బాపూఘాట్ వద్ద 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉంది. మొత్తంగా మూసీ నది హైదరాబాద్‌కు మణిహారంలా మారేలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Details
ఈ నెల 13న రేవంత్ రెడ్డి సమావేశం
ఈ అభివృద్ధి పనుల కోసం ఎంఆర్‌డీసీఎల్ (మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మూసీ పునరుజ్జీవ ప్రణాళికపై పర్యావరణవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజాప్రతినిధులు, మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు మరియు ఇతర ప్రముఖులతో ఈ నెల 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో ప్రాజెక్టు పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
Details
అచ్చెరువొందేలా త్రివేణి సంగమం
హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఈసీ నది, గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సుమారు 11 కిలోమీటర్ల దూరంలో మూసీ ప్రవహించి బాపూఘాట్ వద్ద కలుస్తాయి. ఈ రెండు ప్రవాహాల్లో గోదావరి నీటిని కలిపి త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రణాళికలో భాగంగా మొత్తం 20 కిలోమీటర్ల పరిధిలో నదులు, వాటి పరీవాహక ప్రాంతాలు, అలాగే బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పనులకు సుమారు రూ.5,812 కోట్ల వ్యయం అంచనా వేశారు.
Details
వంతెనలు, యాంఫీ థియేటర్లు
హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు చేపట్టే పనులను జోన్-1గా పేర్కొని అభివృద్ధికి రూ.1,684 కోట్ల అంచనా వ్యయాన్ని ఎంఆర్‌డీసీఎల్ ప్రతిపాదించింది. గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు చేపట్టే పనులను జోన్-2గా పేర్కొని దీనికి రూ.1,992 కోట్ల వ్యయాన్ని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం నదిలో నిరంతరం మంచినీటి ప్రవాహాన్ని కొనసాగించడమే కాకుండా, నదికి ఇరువైపులా ఉన్న పరీవాహక ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడం. జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 15 వంతెనలు నిర్మించనున్నారు.
Details
బోటింగ్ సదుపాయం
ఒక వైపు 100 అడుగుల వెడల్పు రహదారి, మరోవైపు 80 అడుగుల వెడల్పు రహదారి ఏర్పాటు చేస్తారు. అదనంగా కాలిబాటలు, సైక్లింగ్ ట్రాక్‌లు మరియు ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. నదిలో పేరుకుపోయిన పూడికను తొలగించి, అంచులను చదును చేసి, కొన్ని ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా హోటళ్లు, పిల్లల పార్కులు, వేడుకలు నిర్వహించుకునేందుకు యాంఫీ థియేటర్లు నిర్మించనున్నారు. అలాగే మూడు నుంచి నాలుగు ప్రాంతాల్లో చిన్నపాటి ఆనకట్టలు కూడా నిర్మించబడతాయి. గాంధీ సరోవర్‌లో బోటింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నారు.
details
రూ.400 కోట్లతో గాంధీ సరోవర్
బాపూఘాట్ వద్ద సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇందులో 34 ఎకరాల పర్యాటక శాఖ భూమిలో రూ.400 కోట్ల వ్యయంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో 100 మీటర్ల ఎత్తు వరకు బహుఅంతస్తుల టవర్ నిర్మించి అందులో సమావేశ మందిరాలు, కార్యాలయాలు, మ్యూజియం మరియు మహాత్మా గాంధీ జీవిత చరిత్రపై ప్రత్యేక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ టవర్‌పై 35 నుంచి 50 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. విగ్రహం వెనుక లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున ఉన్న 'లండన్ ఐ'ను పోలి ఉండే రంగురంగుల చక్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
డీటైల్స్
ఏడాదికి 2.5 టీఎంసీల నీరు
గాంధీ స్మృతుల్లో ఒకటైన చరఖాను ప్రతిబింబించేలా ఈ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. పక్కనే ఉన్న 98 ఎకరాల రక్షణ శాఖ భూములను సేకరించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించే పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం సుమారు ఐదు టీఎంసీల నీటిని నగరానికి తరలించే ప్రణాళిక ఉంది. ఇందులో రెండున్నర టీఎంసీలను తాగునీటి అవసరాలకు వినియోగించగా, మిగిలిన రెండున్నర టీఎంసీలను మూసీ నదిలో నిరంతర ప్రవాహం కొనసాగించేందుకు ఉపయోగించనున్నారు