Constable turns hero: ఏడుగురు కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ కానిస్టేబుల్ పెద్ద సాహసం చేశారు. ఆదివారం నీటిలో మునిగిపోతున్న కుటుంబాన్ని రక్షించిన ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ హీరోగా మారాడు. కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ కారులో రాజమహేంద్రవరం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు పి.గన్నవరం మండలం బెల్లంపూడి చేరుకునే సరికి అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన సమయంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నెల్లి శ్రీనివాస్ ఆ మార్గం గుండా వెళుతున్నారు
కానిస్టేబుల్ ను అభినందించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
కారు కాలువలో ఉండటాన్ని గమనించి అతను వెంటనే చెరువులోకి దూకి, కారు తలుపులు తెరిచి, ఏడుగురు బాధితులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువచ్చాడు. బాధితులు కసుకుర్తి భాస్కర సుధీర్‌కుమార్, అతని భార్య కె సింధు, పిల్లలు భాను, జయాంశు, తల్లి కె పార్వతి, అత్త బిక్కిన సూర్యకాంతం, మామ సుబ్బరాయుడు సురక్షితంగా బయటపడ్డారు. శ్రీనివాస్‌కు వాలంటీర్ లక్ష్మణ్‌తోపాటు స్థానికులు సహకరించారు. కారులో ఉన్న ఏడుగురు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు 108కి సమాచారం ఇవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ సాహసోపేతమైన చర్యకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కె.చిట్టిబాబు అభినందనలు తెలిపారు.