LOADING...
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి అరుదైన గౌరవం.. నెం.1 రైలు రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్
ఏపీకి అరుదైన గౌరవం.. నెం.1 రైలు రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్

Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి అరుదైన గౌరవం.. నెం.1 రైలు రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రముఖ మీడియా సంస్థ 'ఇండియా టుడే' నిర్వహించిన నేషనల్ టూరిజం సర్వేలో విశాఖపట్నం-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ రైలు మార్గంగా ఎంపికైంది. 'ఇండియన్ రూట్స్' ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో ఈ రూట్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను జూన్ 15న గోవాలో జరగనున్న 'ఇండియా టుడే టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్-2026' కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరఫున అవార్డును స్వీకరించేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు ఇండియా టుడే సంస్థ అధికారిక ఆహ్వానం పంపింది.

వివరాలు

జాతీయ స్థాయి గుర్తింపు రావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

జాతీయ స్థాయి గుర్తింపు రావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. గోవాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మరింత గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. తూర్పు కనుమల మధ్య సాగే విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం తన అద్భుతమైన ప్రకృతి సోయగాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సొరంగ మార్గాలు, గుహలు, పచ్చని లోయలు, జలపాతాల అందాలు ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

వివరాలు

ఈ రూట్‌కు అత్యున్నత గుర్తింపు

ఈ విశిష్టతల కారణంగానే దేశవ్యాప్తంగా ఈ రూట్‌కు అత్యున్నత గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యాటక శాఖ తెలిపింది. అలాగే గోవాలో నిర్వహించే టూరిజం సమ్మిట్‌లో దేశ పర్యాటక రంగ అభివృద్ధి, కొత్త అవకాశాలు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కీలక అంశాలపై జరిగే చర్చల్లో మంత్రి దుర్గేష్ పాల్గొననున్నారు. ఈ అవార్డు ద్వారా రాష్ట్రంలో పర్యాటకుల రాక మరింత పెరిగి, పర్యాటక రంగాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement