LOADING...
Silao Khaja: దేశం దాటిన రుచి.. లాలూ నుంచి మోదీ దాకా అభిమానించిన సిలావ్‌ ఖాజా
దేశం దాటిన రుచి.. లాలూ నుంచి మోదీ దాకా అభిమానించిన సిలావ్‌ ఖాజా

Silao Khaja: దేశం దాటిన రుచి.. లాలూ నుంచి మోదీ దాకా అభిమానించిన సిలావ్‌ ఖాజా

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగువాళ్లకు కాకినాడ కాజా ఎంత ప్రసిద్ధో, బిహార్‌లోని నలంద జిల్లా సిలావ్‌ పట్టణానికి 'సిలావ్‌ ఖాజా' అంతే పేరొందింది. ఈ సంప్రదాయ మిఠాయి రుచి దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, విదేశాలకూ విస్తరించింది. బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి ప్రధాన నగరాల నుంచి మాత్రమే కాకుండా దుబాయ్, అమెరికా, లండన్‌ల నుంచి కూడా ఆన్‌లైన్‌ ఆర్డర్లు వస్తుండటం దీని ఖ్యాతికి నిదర్శనం. ఈ విశిష్టతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 'సిలావ్‌ ఖాజా'కు జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) ట్యాగ్‌ను మంజూరు చేసింది. సిలావ్‌లోని 'శ్రీ కాళీ షా ఖాజా షాప్‌'కు ఈ గుర్తింపు లభించింది. సిలావ్‌కు చెందిన పాకశాస్త్ర నిపుణుడు కాళీ షా సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ఖాజాను తొలిసారిగా తయారు చేశారు.

Details

ఒకే పేరుతో 13 షాపులు

కాలక్రమేణా ఆయన వారసులు అందరూ కాళీ షా పేరుతోనే ఖాజా దుకాణాలు ప్రారంభించారు. ప్రస్తుతం సిలావ్‌ పట్టణంలో ఒకే పేరుతో 13 ఖాజా షాపులు కొనసాగుతున్నాయి. కాలంతో పాటు ఖాజాల తయారీ విధానంలో కూడా మార్పులు వచ్చాయని దుకాణదారు సంజీవ్‌ గుప్తా తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త రుచులను పరిచయం చేస్తున్నామని, త్వరలోనే మఖానా ఖాజాను మార్కెట్లోకి విడుదల చేయనున్నామని వెల్లడించారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో సిలావ్‌ ఖాజాను రైల్వే మెనూలో చేర్చడం మరో విశేషం.

Details

కిలో రూ.250 నుంచి 3వేల వరకు

అలాగే ఒక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఖాజా రుచిని బహిరంగంగా ప్రశంసించారు. సిలావ్‌ ఖాజాల ధరలు రకాన్ని బట్టి కిలోకు రూ.250 నుంచి రూ.3,000 వరకు ఉంటాయి. ఈ మిఠాయి తయారీ, విక్రయాలపై ఆధారపడి సిలావ్‌ పట్టణంలో సుమారు 300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. సంప్రదాయం, రుచి, ఉపాధి... అన్నింటినీ సమన్వయంగా నిలబెట్టుకున్న మిఠాయిగా సిలావ్‌ ఖాజా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Advertisement