Murder: ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
శ్రీ సత్య సాయి జిల్లాలో ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఇటీవలే టీడీపీలోకి చేరిన ఈ వ్యక్తి హత్య గ్రామం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. రానున్న ఎన్నికల నేపధ్యంలో ఈ హత్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కూతాలపల్లి గ్రామానికి చెందిన "దుద్దుకుంటా అమర్నాథ్ రెడ్డి" ఇటీవలే పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ కారణంగా అమర్నాథ్ రెడ్డి పొలం పనుల్లో భాగంగా ఆయన పొలంలో నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని కాపు కాసి వేట కొడవళ్ళతో గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు, ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాజకీయపరమైన హత్య?
కేసు నమోదు చేసిన పోలీసులు ఇది రాజకీయపరమైన హత్య, లేదా ఏదైనా వ్యక్తిగత గొడవల కారణంగా జరిగిందా అంటూ ఆరా తీస్తున్నారు. అయితే ఈ హత్యకు సంబంధించి ఎలాంటి వివరాలను ఇప్పటివరకు పోలీసులు వెల్లడించలేదు. హత్యకు గురైన అమర్నాథ్ రెడ్డికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.