Page Loader
దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

వ్రాసిన వారు Stalin
Jul 10, 2023
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధానిలోని బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ సేవలపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి అధికారం కల్పించే వివాదాస్పద ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఆర్డినెన్స్‌పై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే సోమవారం వాయిదా వేసింది. ఈ విచారణలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను పార్టీగా చేర్చేందుకు ధర్మాసనం అనుమతించింది. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

దిల్లీ

జులై 17న తదుపరి విచారణ

వాస్తవానికి కేంద్రం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలోని దిల్లీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. అయితే అందుకు అంగీకరించని ధర్మానసం కేంద్రం, ఎల్జీకి నోటీసులు జారీ చేసింది. దిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. కేంద్రం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఈ కేసు విచారణ జులై 17కు వాయిదా పడింది. దిల్లీలో బ్యూరోక్రాట్‌లను నియంత్రించే అధికారం ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉంటుందని, గవర్నర్‌కు గానీ, కేంద్రానికి గానీ ఉండదని సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్‌ తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు వెలువడిన అనంతరం దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను తగ్గించేందుకు కేంద్రం మే 19న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.