యోగి స్వస్థలంలో దారుణం: యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జరిగిన సంఘటన సంచలనంగా మారింది. గోరఖ్‌పూర్‌లోని దీన్ దయాల్ ఉపాధ్యాయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్లపై ఏబీవీపీ కార్యకర్తలు దాడికి దిగారు. యూనివర్సిటీలో అనేక అక్రమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్లపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసారని అక్కడి విద్యార్థులు చెబుతున్నారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో వైస్ చాన్స్‌లర్ రాజేష్ సింగ్, రిజిస్ట్రార్ అజయ్ సింగ్ గాయాల పాలయ్యారు. ఈ ఘర్షణను ఆపడానికి పోలీసులు వచ్చారు. అయితే ఏబీవీపీ కార్యకర్తలు పోలీసుల మీద కూడా దాడి చేసారు.
10మంది ఏబీవీపీ కార్యకర్తలపై కేసు
ఈ ఘర్షణలో పాల్గొన్న ఏబీవీపీ కార్యకర్తల్లో 10మందిపై కేసును నమోదు చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ గొడవలో పోలీసులు కూడా గాయాల పాలయ్యారు. విద్యార్థుల సమస్యలపై గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు, సమస్యలకు పరిష్కారం కావాలని వైస్ ఛాన్స్‌లర్‌ను కలవాలని అనుకున్నారని, కానీ కలిసేందుకు అనుమతి దొరకలేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో కోపం తెచ్చుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, వైస్ ఛాన్స్ లర్ దిష్టిబొమ్మను జులై 13న దగ్ధం చేస్తూ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న విద్యార్థులను వైస్ ఛాన్స్ లర్ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై వైస్ ఛాన్స్‌లర్‌తో మాట్లాడాలని ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు, గొడవకు దిగినట్లు తెలుస్తోంది.