Loading...
Dhanush: వెండి దీపాలపై కమలం ముద్ర.. ధనుష్‌ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాడులో ఆసక్తికర చర్చ
వెండి దీపాలపై కమలం ముద్ర..

Dhanush: వెండి దీపాలపై కమలం ముద్ర.. ధనుష్‌ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాడులో ఆసక్తికర చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. మహిళా అభిమానులకు ఇచ్చిన వెండి దీపాలపై కమలం గుర్తు కనిపించడంతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే, ఆ గుర్తుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన అభిమాన సంఘం ప్రతినిధి స్పష్టం చేశారు. చెన్నైలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ధనుష్‌ తన అభిమాన సంఘం మహిళా విభాగం సభ్యులను కలిశారు. ఈ సమావేశానికి సుమారు 3,000 మంది మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఫొటోలు దిగిన ధనుష్‌.. దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ వెండి దీపాలను బహుమతిగా అందజేశారు.

వివరాలు 

తమిళనాడు రాజకీయాల్లో చర్చ

అయితే, ఆ దీపాలపై భాజపా ఎన్నికల గుర్తు అయిన కమలం ముద్ర కనిపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

దీపాలపై ఉన్న కమలం గుర్తు తయారీదారుకు సంబంధించిన ముద్ర మాత్రమేనని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ధనుష్‌ నర్పణి ఇయక్కం ప్రతినిధి వెల్లడించారు.

మరోవైపు, ఈ అంశంపై కాంగ్రెస్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు స్పందించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

వివరాలు 

త్వరలో రాజకీయాల్లోకి ధనుష్

ఇదిలా ఉండగా, ధనుష్‌ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది.

'తమిళగ ఎళుచ్చి కళగం' పేరుతో ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల తన అభిమాన సంఘం పేరును 'ధనుష్‌ నర్పణి ఇయక్కం'గా మార్చడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిర్వాహకులను నియమించడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది.

అయితే, ధనుష్‌ రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ADVERTISEMENT