Online EOW Scam: రూ. 1,000 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ యాక్టర్ గోవింద
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవింద భారీ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఆన్‌లైన్‌లో రూ.1000 కోట్ల పోంజీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) త్వరలో నటుడు గోవిందను ఈ కేసులో విచారించనుంది. సోలార్ టెక్నో అలయన్స్ చాలా దేశాల్లో క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఆన్‌లైన్ పోంజీ పథకాన్ని అక్రమంగా నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిని నటుడు గోవింద ప్రమోట్ చేయడంతో విచారించే వారి జాబితాలో ఆయన పేరును కూడా ఆర్థిక నేరాల విభాగం చేర్చింది. ఈ స్కామ్ వల్ల దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా బాధితులుగా మారినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణం విలువ రూ.1000 కోట్ల మేర ఉంటుందని చెప్పారు.
త్వరలో ముంబైకి విచారణ బృందం
సినీ నటుడు గోవిందను విచారించేందుకు త్వరలో ముంబైకి ఒక బృందాన్ని పంపనున్నట్లు ఈఓడబ్ల్యూ ఇన్‌స్పెక్టర్ చెప్పారు. గోవింద కొన్ని వీడియోల్లో కంపెనీని ప్రమోట్ కూడా చేశాడని ఆయన పేర్కొన్నారు. నటుడు గోవింద కేవలం అనుమానితుడు మాత్రమే అని, నిందితుడు కాదని ఆయన వివరించారు. విచారణ తర్వాతే కేసులో గోవింద పాత్ర ఏమిటో తెలుస్తుందని ఇన్‌స్పెక్టర్ అన్నారు. వ్యాపార ఒప్పందం ప్రకారం మాత్రమే బ్రాండ్‌ను ప్రచారం చేయడం వరకు పరిమితం అయితే గోవిందను తాము ఈ కేసులో సాక్షిగా చేరుస్తామని పేర్కొన్నారు. ఆగష్టు 7, 2023న, ఒడిశా ఆర్థిక నేరాల విభాగం కంపెనీ యజమాని, ప్రధాన నిందితుడు గుర్తేజ్ సిద్ధూతో పాటు అతని సహచరుడు నిరోద్ దాస్‌ను అరెస్టు చేసింది.