TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్ కు కోర్టులో చుక్కెదురు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ తమిళ సినిమా నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ కోర్టులో చుక్కెదురైంది. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.1.5 కోట్ల పెనాల్టీని రద్దు చేయాలని ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. ఈ ప్రకారం, ఆయనకు ఈ పెనాల్టీని చెల్లించాల్సివుంటుందని తీర్పు స్పష్టం చేసింది. ఈ తీర్పును మద్రాస్ హైకోర్టు ఈ రోజు ఉదయం అధికారికంగా ప్రకటించింది. ఆదాయపు పన్ను శాఖ విజయ్‌పై 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించారని ఆరోపించింది. ముఖ్యంగా అప్పట్లో విడుదలైన పులి సినిమాలో ఆయనకు లభించిన పారితోషికాన్ని తగ్గించి చూపారని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
విజయ్ అప్పీల్ ను తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు
శాఖ ఆధారాల ప్రకారం, ఆ సినిమాలో విజయ్ మొత్తం రూ.15 కోట్లు పారితోషికంగా పొందగా, అందులో రూ.5 కోట్లను నగదు రూపంలో స్వీకరించారని, కానీ ఈ మొత్తాన్ని లెక్కల్లో చూపకపోవడం ద్వారా ఆదాయపు పన్ను తప్పించుకున్నారని చెప్పారు. ఈ విషయం శాఖ దర్యాప్తులో బయటపడటంతో విజయ్‌పై రూ.1.5 కోట్ల పెనాల్టీ విధించబడింది. విజయ్ ఆ పెనాల్టీని రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసారు. సుదీర్ఘ విచారణ తరువాత, మద్రాస్ హైకోర్టు గత నెల 23న తీర్పును రిజర్వు చేసింది. చివరికి ఈ రోజు ఉదయం హైకోర్టు తీర్పును వెలువరిస్తూ, ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.1.5 కోట్ల పెనాల్టీని విజయ్ చెల్లించాల్సివుంటుందని ఖచ్చితంగా తెలిపింది.