Kerala: ఎమర్జెన్సీ పేరుతో డాక్టర్‌కు ఫోన్.. ఇంటికి పిలిచి దాడి, రూ.3.5 లక్షల దోపిడీ
ఈ వార్తాకథనం ఏంటి
డాక్టర్‌ను అత్యవసర చికిత్స పేరుతో ఇంటికి పిలిచి దాడి చేసిన ఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకుంది. బాధితుడిని చితకబాది మొబైల్ ఫోన్‌తో పాటు రూ.3.5 లక్షలు దోచుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు నటులు ఉండటం కలకలం రేపుతోంది. ఈ నెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటుడు అతుల్య చంద్ర, నటుడు, నిర్మాత బిబిన్ పెరుంబిలి మరికొందరితో కలిసి ఓ డాక్టర్‌కు ఫోన్ చేశారు. తమకు తెలిసిన వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని,అత్యవసరంగా వైద్యసేవలు అవసరమని చెప్పారు. వెంటనే ఓ అపార్ట్‌మెంట్‌కు రావాలని కోరారు. దీంతో డాక్టర్ వారు చెప్పిన చిరునామాకు వెళ్లారు.
వివరాలు
'నువ్వు దొంగవి.. నిన్ను చంపేస్తాం'
ఆయన అక్కడికి చేరుకునే సమయానికి ఫ్లాట్‌లో ఇప్పటికే 12 మంది ఉన్నారు. బిబిన్ పెరుంబిలితో పాటు అక్కడున్న మరికొందరు ఒక్కసారిగా డాక్టర్‌పై దాడికి దిగారు.
అనంతరం బాధితుడిని ఓ కుర్చీలో కూర్చోబెట్టి కడుపు, పక్కటెముకలపై విచక్షణారహితంగా కొట్టారు.
ఈ క్రమంలో అతుల్య చంద్ర డాక్టర్‌కు చెందిన మొబైల్ ఫోన్, స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లను లాక్కుంది.
అంతటితో ఆగకుండా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు దిగింది.
''నువ్వు దొంగవి.. నిన్ను చంపేస్తాం. మా బంధువుల్లో ఒకరిపై అత్యాచారం చేశావు. అంతేకాకుండా మాపైనే కేసు పెడతానని బెదిరించావు'' అంటూ హెచ్చరించింది.
వివరాలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ఎలాగోలా వారి చెర నుంచి బయటపడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ దాడి వెనుక కేవలం దోపిడీ ఉద్దేశమే ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.