Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు.. రుణసాయం ఒప్పందానికి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆమోదం
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) రుణసాయం ఒప్పందానికి ఆమోదం తెలిపింది. మనీలాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం ఏడీబీ ద్వారా రూ.8,000 కోట్ల రుణం అందనుంది. ఇటీవల ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు, కేంద్ర ఆర్థికశాఖ, సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) అధికారుల మధ్య కీలక చర్చలు జరిగాయి. వచ్చే నెల 19న ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తవుతాయి. డిసెంబర్ చివరి నాటికి సుమారు 25 శాతం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ రుణానికి ఐదేళ్లపాటు మారటోరియం
మొత్తం రూ.15,000 కోట్లలో, ప్రపంచ బ్యాంకు,ఏడీబీ కలిసి రూ.13,500 కోట్లను రుణంగా అందించనున్నాయి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. ఈ రుణానికి ఐదేళ్లపాటు మారటోరియం ఉండగా, ఆ తర్వాత చెల్లింపులు ప్రారంభమవుతాయి. రుణం చెల్లింపులు ఆరు నెలలకొకసారి వాయిదా రూపంలో, మొత్తం 23 సంవత్సరాలపాటు సాగుతాయి. ఈ రుణాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.