2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే?
2022లో కశ్మీర్ లోయలో జరిగిన ఎన్‌కౌంటర్ల వివరాలను అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. కశ్మీర్‌లో మొత్తం 93 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్లలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)/లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) నుంచి గరిష్టంగా 108 మంది, జైషే మహ్మద్ (జేఎం) నుంచి 35 మంది, హిజ్బ్ ఉల్-ముజాహిదీన్ నుంచి22 మందితోపాటు 42మంది విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 172 మందిని హతమార్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్‌లో వీధి గొడవలు, రాళ్లతో దాడులు, చనిపోయిన ఉగ్రవాదులకు ఊరేగింపులు లాంటి కార్యక్రమాలు లేవన్నారు. నిత్యం ఇంటర్నెట్ సేవలు లభిస్తున్నాయని ఏడీజీపీ వెల్లడించారు.
'రిక్రూట్‌మెంట్‌లు 37శాతం తగ్గాయి'
ఈ ఏడాది గరిష్టంగా 74 మంది ఉగ్రవాదులు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో చేరినట్లు ఏడీజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. అందులో 65 మంది ఎన్‌కౌంటర్లలో చనిపోయారని, 17 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో 18 మంది ఉగ్రవాదులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నారని చెప్పారు. అయితే గతేడాదితో పోలిస్తే.. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు రిక్రూట్‌మెంట్‌లు 37శాతం తగ్గినట్లు తాము గమనించినట్లు విజయ్ కుమార్ వివరించారు. కొత్తగా రిక్రూట్ అయిన ఉగ్రవాదుల జీవితకాలం బాగా తగ్గిపోయిందని ఏడీజీపీ తెలిపారు. చనిపోయిన 65మంది ఉగ్రవాదుల్లో 58 మంది.. ఎల్‌ఈటీలో చేరిన మొదటి నెలలోనే మరణించినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో 360 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.