Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ కు మరో షాక్.. బీజేపీలోకి అధీర్ రంజన్?
కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి పార్టీని వీడి బీజేపీలోకి మారే అవకాశం ఉందని టీవీ భరతవర్ష్ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకమే అధీర్ రంజన్ అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధిర్ రంజన్ చౌదరి పార్టీని వీడే అవకాశాన్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఈ విషయంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చౌదరితో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేస్తారని కూడా పార్టీ పేర్కొంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్,మమతా బెనర్జీ పార్టీలు సీట్ల పంపకాల చర్చలను తిరిగి ప్రారంభించినట్లు సమాచారం.
యూ-టర్న్ తీసుకున్న కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్
సీట్ల పంపకాల ఏర్పాటుపై కాంగ్రెస్‌తో విభేదాలను ఉటంకిస్తూ జాతీయ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని బెనర్జీ గతంలో చెప్పారు. యూ-టర్న్ తీసుకున్న రెండు పార్టీలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. సీట్ల పంపకం చర్చలను మళ్లీ ప్రారంభించాయి, ఇది సానుకూల దిశలో కదులుతున్నట్లు చెబుతున్నారు. బెంగాల్‌లోని 42 సీట్లలో ఐదు సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవాలని భావిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల పనితీరు ఆధారంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీకి టిఎంసి గతంలో రెండు సీట్లను ఆఫర్ చేసింది. ఈ ఏర్పాటు సరిపోదని కాంగ్రెస్ భావించింది.