Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం.. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను నేరుగా టార్గెట్ చేస్తూ, NDDB (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు) రిపోర్ట్ ఆధారంగా తీవ్ర ఆరోపణలు చేశారు. లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని స్పష్టం చేసిన ఆయన.. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు అవినీతి, టెండర్ మినహాయింపులు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని మండిపడ్డారు. లడ్డూ వంటి పవిత్ర ప్రసాదం విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని శ్రీనివాస వర్మ విమర్శించారు. 'లడ్డూ విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం.
Details
కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు
కల్తీ నెయ్యి వ్యవహారంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. వైసీపీ నేతల్లా అమ్మనా బూతులు తిట్టాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కల్తీ జరిగిందని ఇప్పటికే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఆ ముగ్గురు ఆ సమయంలో కలసి పని చేశారని పేర్కొన్న శ్రీనివాస వర్మ.. ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న మాటలు నమ్మశక్యం కానివిగా ఉన్నాయని అన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని NDDB రిపోర్ట్ స్పష్టంగా వెల్లడించిందని, ఆ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే బయట పెట్టారని తెలిపారు. 'ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం తయారు చేయలేదు కదా అని ప్రశ్నించారు.
Details
వైఎస్ జగన్‌కు క్లీన్‌చీట్ ఎవరు ఇచ్చారో చూపించాలి
భోలే బాబా అనే సంస్థకు అసలు పాల ఉత్పత్తి లేదని, డైరీ లేదని, పాలు కూడా లేవని పేర్కొన్న ఆయన.. అలాంటి సంస్థ నెయ్యి ఎలా తయారు చేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు క్లీన్‌చీట్ ఎవరు ఇచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని, తప్పు చేశామని ఒప్పుకున్నారని గుర్తుచేసిన ఆయన.. జగన్‌కు ఇంత బాధ ఎందుకు? అని ప్రశ్నించారు. రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే శిక్ష తప్పదని స్పష్టం చేసిన శ్రీనివాస వర్మ.. అలాంటి అవకాశం ఈ వ్యవహారంలో లేదన్నారు. టెండర్ నిబంధనల్లో పెద్ద ఎత్తున మార్పులు చేశారని, అవన్నీ కేవలం అవినీతి కోసమే జరిగాయని ఆరోపించారు.
Details
పూర్తి స్థాయిలో విచారణ జరగాలి
ఆ నెయ్యితోనే స్వామివారికి హారతి ఇస్తారు. అలాంటి పవిత్రమైన నెయ్యినే కల్తీ చేశారంటూ తీవ్రంగా మండిపడ్డారు. 2022లోనే ఈ అంశంపై రిపోర్ట్ వచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన కేంద్ర మంత్రి.. అర్హత లేని సంస్థలకు నెయ్యి కాంట్రాక్టులు ఎలా అప్పగించారని నిలదీశారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందేనని భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.