IndiGo: డీజీసీఏ తర్వాత సీసీఐ పరిశీలన.. ఇండిగోకు కొత్త సమస్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌ల రద్దు కారణంగా దేశీయ విమాన రంగంలో కలకలం రేపిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. మార్కెట్‌లో న్యాయబద్ధమైన పోటీకి సంబంధించి ఇండిగో ఏవైనా నిబంధనలు ఉల్లంఘించిందో లేదో తెలుసుకోవడానికి ప్రాథమిక పరిశీలనను ప్రారంభించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, సీసీఐ సుమోటోగా (తన సొంతప్రేరణతో) పరిశీలనను చేపట్టింది. మార్కెట్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా ఉన్న ఇండిగో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగ పరుస్తుందా అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే, ఇప్పటివరకూ ఈ అంశంపై ఎలాంటి ఫిర్యాదు దాఖలు కాలేదు.
Details
వివిధ అంశాలపై పరిశీలన
అధికారుల ప్రకారం, ఇండిగోకి మార్కెట్‌లో ఉన్న స్థూల ఆధిపత్యం, ఇతర సంస్థలపై ప్రభావం, అధిక ధరలు విధించడం, ఇతరులకు మార్కెట్‌లో స్థానం దక్కకుండా చేయడం వంటి అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. సీసీఐ ఎటువంటి సంస్థ ఆధిపత్యం తప్పు కాదని, ఆ స్థానాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రమే నిబంధనల ఉల్లంఘన అని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం, సీసీఐ ముందుగా ప్రాథమిక సమాచారం ఆధారంగా పరిశీలన చేపడుతుంది. అవసరమైతే ఉల్లంఘన నిర్ధారిస్తే పూర్తి స్థాయి పర్యవేక్షణ మొదలవుతుంది. డీజీసీఏ(DGCA) కూడా ఇండిగోపై దృష్టి పెట్టింది. ఫ్లైట్‌ల రద్దుకు సంబంధించిన కారణాలను, పైలట్ డ్యూటీ, విశ్రాంతి నిబంధనల ప్రకారం ప్లానింగ్‌లో లోపమేమో పరిశీలిస్తోంది. ప్రధాన కారణం ఇదే అయి ఉండొచ్చని అధికార వర్గాలు అంచనా వేశారు.
Details
నలుగురు సభ్యులతో కమిటీ పూర్తి
ఇప్పటికే, డీజీసీఏ ఇండిగో ప్రధాన కార్యాలయంలో ఇద్దరు ప్యానల్ సభ్యులను ఫ్లైట్ ఆపరేషన్స్, చెల్లింపులు, ప్యాసెంజర్ సహాయం వంటి అంశాలను పర్యవేక్షించడానికి పంపింది. తదుపరి చర్యగా నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్‌లను పరిశీలన కోసం డిప్యూటేషన్‌పై పంపినప్పటికీ, వీరిపై సర్వే పర్యవేక్షణకు వేటు పడింది. అదనంగా, సిబ్బంది నిర్వహణ, విధుల కేటాయింపు, కొత్త నిబంధనలకు సంస్థ ఎంత మేరకు సిద్ధంగా ఉందో తెలుసుకోవడానికి నలుగురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఈ చర్యల ద్వారా ఇండిగో వ్యవహారాలపై సీసీఐ, డీజీసీఏ సంయుక్తంగా పర్యవేక్షణ కొనసాగిస్తూ, ఫ్లైట్ రద్దుల తర్వాత మార్కెట్ స్థితి, నిబంధనల అమలు స్థాయి, పాసెంజర్ ప్రయోజనాలను పరిశీలిస్తోంది.