టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్
2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో లోక్‌సభ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో బీజేపీలో, కేంద్ర మంత్రివర్గంలో భారీమార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. అంత కంటే ముందే.. ఈ మార్పులు, చేర్పులు చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. జవవరి 14వ తేదీ తర్వాత ప్రధాని మోదీ కేంద్రమంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. జనవరి 20వ తేదీతో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియనుంది. అదే సమయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా జనవరిలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆ రాష్ట్రాలకే పెద్ద పీట!
గతేడాది జులై 7న ప్రధాని మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణను చేపట్టింది. ఈ క్రమంలో 12మంది మంత్రులను మంత్రివర్గం నుంచి మోదీ తప్పించారు. అయితే ఆ సారి కూడా సరిగా పనిచేయని మంత్రులను మోదీ తొలగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పునర్వ్యవస్తీకరణలో.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మోదీ పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకో 15నెలల సమయం ఉన్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచి ప్రధాని మోదీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే పార్టీలో, ప్రభుత్వంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.