Loading...
NLSIU CJI : నల్సార్ తర్వాత మరో లా వర్సిటీలో నిరసన.. సీజేఐ రావొద్దంటూ విద్యార్థుల డిమాండ్
నల్సార్ తర్వాత మరో లా వర్సిటీలో నిరసన.. సీజేఐ రావొద్దంటూ విద్యార్థుల డిమాండ్

NLSIU CJI : నల్సార్ తర్వాత మరో లా వర్సిటీలో నిరసన.. సీజేఐ రావొద్దంటూ విద్యార్థుల డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ)లోనూ స్నాతకోత్సవ వేడుకకు సంబంధించిన వివాదం మొదలైంది. రాబోయే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఛైర్మన్ మనాన్ కుమార్ మిశ్రాను ఆహ్వానించడంపై యూనివర్సిటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వివరాలు 

నల్సార్ వివాదం తర్వాతే..

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్)లో స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థుల్లో కొందరు ఇటీవల వ్యతిరేకత వ్యక్తం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ విద్యార్థులను రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌లో న్యాయవాదులుగా నమోదు చేయవద్దంటూ బీసీఐ హుటాహుటిన ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

అయితే ఆ ఉత్తర్వులను బీసీఐ అనంతరం ఉపసంహరించుకుంది.

విద్యార్థుల గౌరవం, ఆలోచనా స్వేచ్ఛ, న్యాయమైన ఆందోళనలను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ బీసీఐ ఛైర్మన్ మనాన్ కుమార్ మిశ్రా లా విద్యార్థులకు క్షమాపణలు కూడా చెప్పారు.

వివరాలు 

నల్సార్ విద్యార్థులకు ఎన్ఎల్ఎస్ఐయూ సంఘీభావం

ఈ నేపథ్యంలో శనివారం ఎన్ఎల్ఎస్ఐయూ విద్యార్థులు,పూర్వ విద్యార్థులు సంయుక్తంగా ఒక లేఖ విడుదల చేశారు.

నల్సార్‌లోని తమ సహచర విద్యార్థులకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.

బీసీఐ ఛైర్మన్ వ్యవహరించిన తీరును తప్పుబట్టడంతో పాటు,తమ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ హాజరుకావడాన్ని వ్యతిరేకించారు.

గ్రాడ్యుయేషన్ వేడుకకు ఎవరు వస్తున్నారన్నది మాత్రమే తమ ఆందోళన కాదని విద్యార్థులు స్పష్టం చేశారు.

దేశంలోని ప్రముఖ లా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ఎలాంటి వృత్తిపరమైన పరిణామాల భయం లేకుండా శక్తివంతమైన సంస్థలు, ప్రజా అధికారులతో విభేదించే స్వేచ్ఛ కలిగి ఉండాలని పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ధైర్యం చూపిన నల్సార్ విద్యార్థులకు తాము బేషరతుగా మద్దతు ఇస్తున్నామని తెలిపారు.

అధికారాన్ని ప్రశ్నించడంలో వారు చూపిన ధైర్యం, నైతిక స్పష్టతను ప్రశంసించారు.

ADVERTISEMENT

వివరాలు 

బీసీఐకి కీలక డిమాండ్లు

నల్సార్ విద్యార్థులు, అధ్యాపక వర్గానికి బీసీఐ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎన్ఎల్ఎస్ఐయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాథమిక హక్కైన భావప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నం బీసీఐ చేసిందని ఆరోపించారు.

అదే సమయంలో వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేయడానికి బీసీఐ అధికారిక లెటర్‌హెడ్‌ను ఛైర్మన్ ఎలా ఉపయోగించారో స్పష్టత ఇవ్వాలని కోరారు.

ADVERTISEMENT

వివరాలు 

బీసీఐతో ఎన్ఎల్ఎస్ఐయూకు సుదీర్ఘ సంబంధం

ఎన్ఎల్ఎస్ఐయూ, బీసీఐ మధ్య చాలాకాలంగా సంస్థాగత సంబంధాలు ఉన్నాయి.

యూనివర్సిటీ పాలక మండళ్లలో సీజేఐతో పాటు బీసీఐ ఛైర్మన్ కూడా సభ్యులుగా ఉంటారు.

2025లో జరిగిన ఎన్ఎల్ఎస్ఐయూ స్నాతకోత్సవానికి అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సూర్యకాంత్ అధ్యక్షత వహించారు.

అదే కార్యక్రమంలో మనాన్ కుమార్ మిశ్రా స్వాగతోపన్యాసం చేశారు. తాజా పరిణామాలతో దేశంలోని రెండు కీలక న్యాయ సంస్థలు చర్చలోకి వచ్చాయి.

సుప్రీంకోర్టు, న్యాయ వృత్తికి చట్టబద్ధ నియంత్రణ సంస్థగా ఉన్న బీసీఐ.. దేశంలోని ప్రముఖ లా స్కూళ్లలో ఒకటైన ఎన్ఎల్ఎస్ఐయూ విద్యార్థులతో సాగుతున్న ఈ చర్చకు కేంద్రంగా మారాయి.

వివరాలు 

అసలు నల్సార్‌లో ఏం జరిగింది?

నల్సార్ స్నాతకోత్సవానికి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని యూనివర్సిటీ ప్రతిపాదించడంతో వివాదం మొదలైంది.

ఈ ఆహ్వానాన్ని కొందరు గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు వ్యతిరేకించారు.

దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల సమయంలో పోలీసుల అణచివేతకు సంబంధించిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరిన సందర్భంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ సమయంలో సీజేఐ సూర్యకాంత్ "మా సమయం వృధా చేయవద్దు" అని వ్యాఖ్యానించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు.

అయితే తాను పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించలేదని, దాన్ని సరైన విధానంలో దాఖలు చేయాలని మాత్రమే సూచించానని సీజేఐ తరువాత స్పష్టం చేశారు.

వివరాలు 

బీసీఐ సంచలన ఉత్తర్వులు

ఈ పరిణామాల మధ్య గురువారం బీజేపీ రాజ్యసభ సభ్యుడైన మనాన్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని బీసీఐ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

నల్సార్ 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌లోని విద్యార్థులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌లో నమోదు చేయవద్దని ఆదేశించింది.

దేశ అత్యున్నత న్యాయస్థానం పట్ల గౌరవం, మర్యాద చూపని లా విద్యార్థి భవిష్యత్తులో బాధ్యతాయుతమైన లేదా సమర్థుడైన న్యాయవాది, ఉపాధ్యాయుడు లేదా న్యాయమూర్తిగా మారతాడని ఆశించలేమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నిర్ణయం వెంటనే తీవ్ర దుమారం రేపింది. అయితే ఆ ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని గంటల్లోనే నల్సార్ విద్యార్థులందరినీ శిక్షించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసేందుకు మిశ్రా ప్రయత్నించారు.

వివరాలు 

మెజారిటీ విద్యార్థులు నిర్దోషులే: మిశ్రా

ఎక్స్ వేదికగా స్పందించిన మిశ్రా.. నల్సార్‌లోని "మెజారిటీ" విద్యార్థులు నిర్దోషులని తెలిపారు. కొందరి అవాంఛిత ప్రవర్తనకు మిగిలిన విద్యార్థులు నష్టపోకూడదని పేర్కొన్నారు.

విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ తర్వాత అదే రాత్రి బీసీఐ తన వివాదాస్పద ఉత్తర్వులను పూర్తిగా ఉపసంహరించుకుంది.

ఈ పరిణామాల అనంతరం నల్సార్ విద్యార్థులకు మద్దతుగా ఎన్ఎల్ఎస్ఐయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కూడా గళమెత్తడంతో లా విద్యార్థుల భావప్రకటన స్వేచ్ఛ, వృత్తిపరమైన స్వాతంత్ర్యం, న్యాయ సంస్థల వ్యవహారశైలిపై చర్చ మరింత విస్తృతమైంది.

ADVERTISEMENT