Delhi air quality: దిల్లీలో వర్షం తర్వాత.. కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత
దిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాల తరువాత గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం, పొగమంచు నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వర్షం తర్వాత దిల్లీలో గాలి నాణ్యత సూచికలో క్షీణత నమోదైంది. కానీ గాలి నాణ్యత ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆనంద్ విహార్‌లో శనివారం ఉదయం 282, ఆర్‌కే పురంలో 220, పంజాబీ బాగ్‌లో 236, ఐటీఓలో 263గా AQI స్థాయిలు ఉన్నాయి. దిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. వర్షాలు కురిసిన తర్వాత కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టిందని, అయితే గాలి నాణ్యత ఇంకా పూర్తిస్థాయిలో మెరుగుపడలేదని చెప్పారు.శ్వాస తీసుకోవడంలో ఇప్పటికీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నామని వివరించారు.
15 రోజుల పాటు దిల్లీ భారీగా పడిపోయిన గాలి నాణ్యత స్థాయి
దిల్లీ-ఎన్‌సీఆర్‌లో దాదాపు 15 రోజుల పాటు కాలుష్య స్థాయి చాలా దారుణంగా ఉంది. ప్రజలకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. వర్షం కారణంగా నోయిడా సహా ఎన్‌సీఆర్‌లోని ప్రజలు కాలుష్యం నుంచి ఉపశమనం పొందారు. దీపావళి సందర్భంగా ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతున్నారు. 10 రోజుల తర్వాత దిల్లీలో కాలుష్యం స్థాయి తగ్గిందని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. దిల్లీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ సహా వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని ఆ విభాగం సీనియర్ శాస్త్రవేత్త కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు.