Assam: అస్సాంలో నిరసనలు,పోలీసులు కాల్పులు; నలుగురికి గాయలు.. వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సెక్షన్ 163
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాం రాష్ట్రంలోని పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ నిరోలా పాంగ్‌చోపీ వెల్లడించారు. డిసెంబర్ 22 నుంచి జిల్లావ్యాప్తంగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని తెలిపారు. మతపరమైన లేదా వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగకుండా, ప్రజా ఆస్తులకు నష్టం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో సంబంధిత బృందాలకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సోమవారం జరిగిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.
వివరాలు
ఆమరణ దీక్షను చెదరగొట్టే క్రమంలో.. ఖేరోని ప్రాంతంలో విధ్వంసం
గ్రేజింగ్ రిజర్వ్ భూముల్లో జరుగుతున్న అక్రమ ఆక్రమణలను అడ్డుకోవాలంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టే ప్రయత్నంలో కొంతమంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అదే సమయంలో, కర్బి ఆంగ్లాంగ్ ఆటానమస్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తులీరామ్ రోహంగాంగ్ నివాసానికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో డొంకమో ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అయితే ఇళ్లలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది సమయానికి అదుపులోకి తీసుకువచ్చారు. గత 12 రోజులుగా కొనసాగుతున్న ఆమరణ దీక్షను చెదరగొట్టే క్రమంలో ముందుగా ఖేరోని ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకుంది. ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్ (పీజీఆర్), విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్ (వీజీఆర్) భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను తక్షణమే నిలిపివేయాలని నిరసనకారులు తమ డిమాండ్లను స్పష్టం చేశారు.