AI-171 Probe: AI-171 దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ స్విచ్‌లో లోపం లేదన్న కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
గత ఏడాది 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తు తుది దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విమానంలోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ వ్యవస్థపై నిర్వహించిన అత్యాధునిక పరీక్షల్లో ఎలాంటి లోపాలు లేదా సాంకేతిక సమస్యలు గుర్తించలేదని బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. విమాన తయారీ సంస్థ (OEM) ఆధ్వర్యంలో నిర్వహించిన సాంకేతిక పరీక్షల అనంతరం ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ సక్రమంగానే పనిచేస్తోందని నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. అయితే, ప్రస్తుతం అమెరికాలోని సియాటిల్‌లో పూర్తి థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్‌పై సమగ్ర పరిశీలన కొనసాగుతోందని వెల్లడించింది.
వివరాలు
అన్ని కోణాల్లో విచారణ పూర్తయ్యాకే తుది నివేదిక
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తుది నివేదిక విడుదలలో ఎలాంటి జాప్యం జరగలేదని స్పష్టం చేసింది.
పెద్ద విమాన ప్రమాదాల దర్యాప్తుకు నిర్దిష్ట గడువు ఉండదని, అన్ని కోణాల్లో విచారణ పూర్తయ్యాకే తుది నివేదిక విడుదల చేస్తామని పేర్కొంది.
రాజ్యసభలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఫిబ్రవరిలో సంబంధిత విమాన రకాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత, విమానాల భద్రతా ప్రమాణాల పరిశీలనలో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ ప్రత్యేక పరీక్షలను ఆదేశించిందన్నారు.
వివరాలు
AAIB అధికారిక వెబ్‌సైట్‌లో తుది నివేదిక
ప్రమాదానికి సంబంధించిన అన్ని సంభావ్య కారణాలు, వాటికి దోహదపడిన అంశాలపై విచారణ కొనసాగుతోందని మంత్రి సభకు వివరించారు.
దర్యాప్తు పూర్తయిన అనంతరం అందులోని అన్ని నిర్ధారణలతో కూడిన తుది నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు AAIB అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రచురిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.