Loading...
Amaravati: వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ ఏజెంట్‌.. గంటల్లోనే పనులు పూర్తి
వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ ఏజెంట్‌.. గంటల్లోనే పనులు పూర్తి

Amaravati: వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ ఏజెంట్‌.. గంటల్లోనే పనులు పూర్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2026
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అమలు చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పన్నుల వసూళ్ల వ్యవస్థతో పన్నుల నిర్వహణ మరింత వేగవంతమైంది. డేటా విశ్లేషణ, పన్ను రిటర్నుల పరిశీలన, ఆడిట్‌, తనిఖీల వంటి ప్రక్రియలు గతంలో కంటే చాలా సులభంగా మారాయి. సాధారణంగా 6-8 వారాలు పట్టే పనులను ఏఐ సాంకేతికతతో కేవలం రెండు మూడు గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించింది. కేంద్ర జీఎస్టీ కౌన్సిల్‌ అదనపు కార్యదర్శి పంకజ్‌కుమార్‌ సింగ్‌, సంయుక్త కార్యదర్శి డి.పి. మిశ్రా నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి వచ్చి రెండు రోజులపాటు ఈ ఏఐ వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించింది.

వివరాలు

వాణిజ్య పన్నుల అధికారులతో నిరంతరం సంప్రదింపులు

కేంద్ర స్థాయిలోనూ దీనిని అమలు చేసే అంశంపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వివరాలు సేకరిస్తోంది.

కృత్రిమ మేధకు మానవ మేధను జోడించడం ద్వారా రాష్ట్రానికి ప్రతి నెలా రూ.600-750 కోట్ల మేర అదనపు రాబడి సమకూరేలా వ్యవస్థను రూపొందించినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్‌ ఎ.బాబు తెలిపారు.

వివరాలు

జీఎస్టీకి అనుగుణంగా ప్రత్యేక ఏఐ ఏజెంట్

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ.. జీఎస్టీ చట్టాలు, శాఖ కార్యకలాపాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఒక ఏఐ ఏజెంట్‌ను రూపొందించింది.

కేంద్ర ప్రభుత్వ మేఘనాథ్‌ విధానంలో భాగంగా సమాచారం బయటకు వెళ్లకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ చట్టాల పరిధిలోని విధానాలు, షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం, వాటికి సమాధానాలు స్వీకరించడం తదితర మొత్తం 12-13 దశలను ఏఐ ప్రక్రియతో అనుసంధానం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

లీగల్‌ ఏఐ ఏజెంట్‌తో కేసుల విశ్లేషణ సులభం

శాఖ ప్రత్యేకంగా లీగల్‌ ఏఐ ఏజెంట్‌ను కూడా రూపొందించింది. దీంతో రాష్ట్ర హైకోర్టు, జీఎస్టీ అప్పిలేట్‌ అథారిటీ వంటి వేదికల్లో కేసులకు సంబంధించిన పనులు సులభమయ్యాయి.

ఒక కేసును విశ్లేషించి, దానిని సూత్రీకరించే ప్రక్రియ వేగవంతమైంది. నిబంధనల ప్రకారం అవసరమైన డాక్యుమెంటేషన్‌ను కూడా ఏఐ సిద్ధం చేస్తోంది.

దీంతో కోర్టుల్లో కేసులను సమర్పించే ప్రక్రియ మరింత సులభంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

25 వేల మంది పన్ను చెల్లింపుదారుల గుర్తింపు

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. శాఖ రూపొందించిన ప్రత్యేక ఏఐ వ్యవస్థ ద్వారా కొత్తగా మరో 25 వేల మంది పన్ను చెల్లించాల్సిన వారిని గుర్తించారు.

వీరు ప్రతి నెలా దాఖలు చేసే రిటర్నులను గతంతో పోలిస్తే చాలా తక్కువ సమయంలోనే పరిశీలిస్తున్నారు.

కొద్ది గంటల్లోనే రిటర్నుల్లోని తప్పులు, లోపాలను గుర్తించి.. సరైన మొత్తంలో పన్ను వసూలు చేసేలా వ్యవస్థ పనిచేస్తోంది.

వివరాలు

140 భారీ ప్రాజెక్టులపై నిఘా

రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణ ప్రాజెక్టులు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి.

అమరావతి, పోలవరం, జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించిన 140 ప్రాజెక్టులను వాణిజ్య పన్నుల శాఖ గుర్తించి ట్రాక్‌ చేస్తోంది.

ఈ ప్రాజెక్టులకు చెల్లిస్తున్న బిల్లుల మొత్తాలను ఆధారంగా చేసుకుని.. వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయాన్ని ఏఐ సాయంతో పర్యవేక్షిస్తున్నారు.

వివరాలు

మానవ మేధకు ఏఐ తోడైతే పాలన మరింత సులభం

ఒక అధికారి డాక్యుమెంటేషన్‌, డేటా విశ్లేషణ వంటి పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తే ఇతర ముఖ్యమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం కష్టమవుతుంది.

అందుకే ఈ రెండు ప్రక్రియలను ఏఐతో నిర్వహించి, అవసరమైన చోట మానవ మేధస్సును వినియోగిస్తే ప్రభుత్వ శాఖల పనితీరు మరింత మెరుగవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖలు తమ కార్యకలాపాలకు అనుగుణంగా ప్రత్యేక ఏఐ ఏజెంట్లను రూపొందించుకుని ఉపయోగించుకోవచ్చని వాణిజ్య పన్నుల శాఖ అభిప్రాయపడుతోంది.

ADVERTISEMENT