LOADING...
Andhra Pradesh: ఏఐతో వైద్య రంగంలో విప్లవం.. రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు
రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు

Andhra Pradesh: ఏఐతో వైద్య రంగంలో విప్లవం.. రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంతో రాష్ట్రంలో వైద్య సేవలను ఆధునికీకరించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 40 అధునాతన పరికరాలతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ పరికరాల సహాయంతో స్క్రీనింగ్, వివిధ వైద్య పరీక్షలు వేగంగా నిర్వహిస్తున్నారు. దీంతో వ్యాధులను తక్కువ సమయంలోనే గుర్తించి రోగులకు తక్షణ చికిత్స అందించే అవకాశం వైద్యులకు లభిస్తోంది. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు (జీజీహెచ్), విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురం జిల్లా ఆసుపత్రి, తెనాలి జిల్లా ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

వివరాలు 

ఆధునిక పరికరాలతో పరీక్షలు

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకమైన మార్పులకు దారి తీస్తుందని వైద్యశాఖ భావిస్తోంది. వ్యాధుల నిర్ధారణ నుంచి పరీక్షల వరకూ ఏఐ ఆధారిత నూతన పరికరాలను వినియోగిస్తున్నారు. ఈ సాంకేతికతతో పరీక్షల ఫలితాలు వేగంగా,ఎక్కువ ఖచ్చితత్వంతో అందుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రోగి-వైద్యుల మధ్య జరిగే సంభాషణను రికార్డు చేయడం, దగ్గు ధ్వనితో టీబీని గుర్తించడం, గుండె సంబంధిత సమస్యలు, రక్తహీనత వంటి వ్యాధులను గుర్తించడం వంటి పనులను ఈ పరికరాలు చేస్తున్నాయి. అలాగే సర్వైకల్ క్యాన్సర్ గుర్తించేందుకు ఏఐ కెమెరా, చిన్నారుల్లో న్యూరాలజికల్ సమస్యలు గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు, క్యాటరాక్ట్, గ్లూకోమా,సికిల్ సెల్ అనీమియా, రక్తహీనత తదితర పరీక్షలకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. అవసరమైన చోట్ల అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను కూడా అమలు చేస్తున్నారు.

వివరాలు 

తక్కువ సమయంలో నాణ్యమైన వైద్యం

ఇటీవల ప్రారంభమైన ఈ పైలట్ పరీక్షలు త్వరలో ముగియనున్నాయి. వాటి ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నివేదిక సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఏఐ ఆధారిత సేవల ద్వారా తక్కువ సమయంలోనే నాణ్యమైన వైద్య సేవలను పెద్ద సంఖ్యలో ప్రజలకు అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ సేవలను అబా ఐడితో అనుసంధానం చేసి రోగుల వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరచే ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనుంది. వైద్య సేవల్లో సాంకేతిక వినియోగంపై వైద్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

Advertisement

వివరాలు 

ఏపీ మెడ్టెక్ ఇన్నోవేషన్ చాలెంజ్

ముఖ్యమంత్రి సంకల్పాన్ని అమలు చేసేందుకు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' సహకారంతో అవసరమైన పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తున్న సంస్థలు, నిపుణుల నుంచి దేశవ్యాప్తంగా దరఖాస్తులను 'ఏపీ మెడ్టెక్ ఇన్నోవేషన్ చాలెంజ్' పేరుతో ఆరోగ్యశాఖ ఆహ్వానించింది. వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు 'క్యాథ్' (కమిటీ ఫర్ అప్లయిడ్ టెక్నాలజీస్ ఇన్ హెల్త్) అనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

Advertisement

వివరాలు 

18 ప్రతిపాదనలకు కమిటీ సిఫార్సు

ఈ కమిటీలో ఐఐఎస్‌సీ బెంగళూరుకు చెందిన డాక్టర్ వి. రామనాధన్, ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ మోనా దుగ్గల్, ఏఐ నిపుణుడు డాక్టర్ సుహేల కపూర్, స్వస్తి సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ శివకుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డాక్టర్ రాకేష్ కల్పల, మెడ్క్ నిపుణుడు సంగీత్ కుమార్, మరిచి వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సర్వేశ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వానికి మొత్తం 297 అప్లికేషన్లు అందగా వాటిలో 18 ప్రతిపాదనలను కమిటీ సిఫార్సు చేసింది. శాలిసిట్ టెక్నాలజీస్, సన్ఫాక్స్ టెక్నాలజీస్, ఆర్ట్ పార్క్, కాగ్నిటివ్ బోటిక్ టెక్నాలజీస్ సంస్థలు అభివృద్ధి చేసిన పరికరాలను ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో పరీక్షిస్తున్నారు.

వివరాలు 

ఏఐతో క్యాన్సర్ గుర్తింపు

దగ్గు ధ్వనితో టీబీని గుర్తించడం, గుండె సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించడం, చిన్నారుల్లో న్యూరాలజికల్ సమస్యలకు సరైన చికిత్స సూచించడం, గత డేటాను ఆధారంగా తీసుకుని డెంగ్యూ జ్వరాల వ్యాప్తిని ముందుగా అంచనా వేయడం వంటి ప్రక్రియలు ఏఐ ద్వారా జరుగుతున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లో ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. క్యాటరాక్ట్, డయాబెటిక్ న్యూరోపతి వంటి వ్యాధుల నిర్ధారణకు కూడా పరికరాలను ఉపయోగిస్తున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో రక్త నమూనాల్లోని బ్లడ్ స్లైడ్ ఆధారంగా ఎనిమియా, లూకేమియా వంటి వ్యాధులను గుర్తిస్తున్నారు. అలాగే విజయవాడ సిటీ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సూట్‌కేస్ కిట్ల ద్వారా షుగర్, కిడ్నీ, థైరాయిడ్ తదితర రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వివరాలు 

నవజాత శిశువులకు ఆక్సిజన్ సాయం

శరీరానికి అమర్చే చిన్న పరికరాల సహాయంతో నవజాత శిశువులకు అత్యవసర సమయాల్లో తేలికపాటి ఆక్సిజన్ అందించే విధానాన్ని కూడా పరీక్షిస్తున్నారు. కీళ్ల నొప్పుల కారణాలను త్వరగా గుర్తించడం, వైద్యులు-రోగుల మధ్య సంభాషణను రికార్డు చేసి దాని ఆధారంగా రోగ నిర్ధారణ చేసి ప్రిస్క్రిప్షన్ సిద్ధం చేయడం వంటి ప్రయోగాలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి, తెనాలి జిల్లా ఆసుపత్రి, విశాఖలోని విక్టోరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయి. అలాగే రక్త నమూనా తీసుకోకుండానే కంటి ఫోటో ఆధారంగా రక్తహీనతను గుర్తించే సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు.

వివరాలు 

గుండె సమస్యల గుర్తింపు

స్కెతస్కోప్‌కు అదనంగా చిన్న పరికరాన్ని అమర్చి, ఈసీజీ సదుపాయం లేని ప్రాంతాల్లో కూడా గుండె సమస్యలను గుర్తించే పరీక్షలు చేస్తున్నారు. ఐసీయూలో ఉన్న రోగులకు పరికరాలు అమర్చి నిరంతరం బీపీ, పల్స్, శరీర ఉష్ణోగ్రత వంటి ఆరోగ్య సూచికలను పర్యవేక్షిస్తున్నారు. పాడేరు జీజీహెచ్, కర్నూలు, అనంతపురం జీజీహెచ్, తిరుపతి రుయా ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద సేవలు అందిస్తున్న సంస్థలు ఇప్పటివరకు సాధించిన ఫలితాలను త్వరలో క్యాథ్ కమిటీ సమీక్షించనుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.

Advertisement