Loading...
NHAI AI Technology: హైవేలపై ఏఐ నిఘా.. 1 ఎంఎం పగుళ్లనూ గుర్తించే టెక్నాలజీ!
హైవేలపై ఏఐ నిఘా.. 1 ఎంఎం పగుళ్లనూ గుర్తించే టెక్నాలజీ!

NHAI AI Technology: హైవేలపై ఏఐ నిఘా.. 1 ఎంఎం పగుళ్లనూ గుర్తించే టెక్నాలజీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్వహణను మెరుగుపరచడం, రోడ్లపై లోపాలను గుర్తించడం, ప్రయాణికుల భద్రతను బలోపేతం చేయడంపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం కృత్రిమ మేధ (AI), రియల్‌టైమ్ డేటా, డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలను విస్తృతంగా వినియోగిస్తోంది. రహదారులపై సమస్యలను గుర్తించి, సకాలంలో మరమ్మతులు చేపట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) సాంకేతిక సమావేశంలో NHAI చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.పి. పాధీ ఈ వివరాలు వెల్లడించారు. రోడ్లపై లోపాలను గుర్తించేందుకు, వాటిని సకాలంలో సరిచేసేందుకు సాంకేతిక ఆధారిత వ్యవస్థలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

వివరాలు

ఆరు అంశాల ఆధారంగా రోడ్ల నాణ్యత పరిశీలన

రహదారుల ఉపరితల పరిస్థితులను అంచనా వేసేందుకు నెట్‌వర్క్ సర్వే వాహనాలను ఉపయోగిస్తున్నట్లు పాధీ వివరించారు.

ఈ వాహనాలు ఆరు అంశాల ఆధారంగా రోడ్ల నాణ్యతను పరిశీలిస్తాయి. రోడ్డు ఉపరితలంపై ఎగుడుదిగుళ్లు (Roughness), చక్రాల వల్ల ఏర్పడే గాడులు (Rutting), పగుళ్లు (Cracks), రోడ్డు పొరలు ఊడిపోవడం (Ravelling), ప్యాచింగ్, గుంతలు (Potholes) వంటి లోపాలను గుర్తిస్తాయి.

360 డిగ్రీలు, 3డీ ఇమేజింగ్ వ్యవస్థలతో పనిచేసే ఈ వాహనాలు కేవలం 1 మిల్లీమీటర్ వెడల్పు ఉన్న పగుళ్లను కూడా గుర్తించగలవు.

దీంతో చిన్నపాటి లోపాలను సైతం ప్రారంభ దశలోనే గుర్తించి మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంటుంది.

వివరాలు

30 రకాల లోపాలను గుర్తించే ఏఐ కెమెరాలు

హైవే పెట్రోలింగ్ వాహనాల్లో ఏఐ ఆధారిత డ్యాష్‌బోర్డ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి గుంతలు, వెలిసిపోయిన రోడ్డు మార్కింగ్‌లు, దెబ్బతిన్న సూచిక బోర్డులు, విరిగిన క్రాష్ బ్యారియర్లు, పనిచేయని వీధి దీపాలు సహా 30కి పైగా రకాల లోపాలను గుర్తించగలవు.

గుర్తించిన ప్రతి లోపానికి జియోట్యాగింగ్ చేసి, ఫొటో తీసి, ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. దాన్ని సరిచేయడానికి గడువును కూడా నిర్ణయిస్తారు.

మరమ్మతులు పూర్తయ్యాక కాంట్రాక్టర్లు వాటికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేయాలి.

అనంతరం ఇంజినీర్లు వాటిని పరిశీలించి, ఫిర్యాదులను పరిష్కరించినట్లు ధ్రువీకరించిన తర్వాతే వాటిని ముగిస్తారు.

ADVERTISEMENT

వివరాలు

ఆక్రమణలను గుర్తించేందుకు డ్రోన్లు

హైవేలపై ఆక్రమణలు, అక్రమ మీడియన్ ఓపెనింగ్‌లు, ఇతర రహదారి సంబంధిత సమస్యలను గుర్తించేందుకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు.

తరచూ ఒకే ప్రాంతంలో ఏర్పడుతున్న లోపాలను గుర్తించి, వాటి మూల కారణాలను విశ్లేషించడం ద్వారా ముందస్తు నిర్వహణ (Predictive Maintenance) దిశగా అడుగులు వేయాలని NHAI లక్ష్యంగా పెట్టుకుందని పాధీ తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

అన్ని డిజిటల్ వ్యవస్థల అనుసంధానానికి ప్రతిపాదన

ఆర్కాడిస్ సంస్థ డైరెక్టర్, భారత కార్యకలాపాల విభాగం అధిపతి వెంకట చుండూరు హైవేల నిర్వహణ కోసం సమగ్ర ఆపరేటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

నేషనల్ హైవేస్ డేటా లేక్, డిజిటల్ హైవే మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఫాస్టాగ్ (FASTag), 1033 అత్యవసర హెల్ప్‌లైన్‌లను ఒకే వేదికపైకి తీసుకురావాలని కోరారు.

అన్ని వ్యవస్థలను అనుసంధానించే ఉమ్మడి రియల్‌టైమ్ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి వస్తే ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించడం, రహదారుల నిర్వహణను సమర్థంగా ప్రణాళిక చేయడం, కాంట్రాక్టర్ల బాధ్యతను నిర్ధారించడం సులభమవుతుందని తెలిపారు.

అంతేకాకుండా జాతీయ రహదారులను రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారులతో అనుసంధానించేందుకు కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

వివరాలు

రోడ్డు భద్రతకు నాలుగు అంశాలు కీలకం

అంతర్జాతీయ మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్, వ్యూహాత్మక సలహాదారు సమ్రాట్ వలానీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతకు అవగాహన, ఇంజినీరింగ్, నిబంధనల అమలు, అత్యవసర వైద్య సేవలు అనే నాలుగు అంశాలు కీలకమని చెప్పారు.

వియత్నాంలో చేపట్టిన హెల్మెట్ వినియోగ అవగాహన కార్యక్రమాలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.

అక్కడ 100 పాఠశాలల వెలుపల నిర్వహించిన కార్యక్రమాల కారణంగా ఏడాది వ్యవధిలో హెల్మెట్ వినియోగం 36 శాతం నుంచి 69 శాతానికి పెరిగిందని తెలిపారు.

వివరాలు

హైవే సిబ్బంది భద్రతపైనా దృష్టి

రహదారులపై పనిచేసే సిబ్బంది భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వలానీ సూచించారు.

ఇందుకోసం సరైన ట్రాఫిక్ నిర్వహణ, వర్క్ పర్మిట్లు, ఆటోమేటెడ్ స్పీడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థలను అమలు చేయాలని అన్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయకుండా ఉంచే ప్రతి నిమిషంతో ద్వితీయ ప్రమాదాల (Secondary Crashes) ముప్పు 2.8 శాతం పెరుగుతుందని తెలిపారు.

అందువల్ల ప్రమాద స్థలాన్ని త్వరగా క్లియర్ చేయడం, ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించడం అవసరమని వివరించారు.

సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ, వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం, నిబంధనల నిరంతర అమలుతో హైవేల నిర్వహణను మెరుగుపరచడంతో పాటు రోడ్డు భద్రతను బలోపేతం చేయవచ్చని సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT