LOADING...
Telangana: కొత్త జాతీయ రహదారుల్లో స్మార్ట్ టెక్నాలజీ.. వేగం పెరిగితే వెంటనే చలాన్
కొత్త జాతీయ రహదారుల్లో స్మార్ట్ టెక్నాలజీ.. వేగం పెరిగితే వెంటనే చలాన్

Telangana: కొత్త జాతీయ రహదారుల్లో స్మార్ట్ టెక్నాలజీ.. వేగం పెరిగితే వెంటనే చలాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో నిర్మించనున్న కొత్త జాతీయ రహదారులకు ఆధునిక సాంకేతిక హంగులు జోడించేందుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించిన యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై కృత్రిమ మేధస్సు (ఏఐ)ఆధారిత సాంకేతికతను విజయవంతంగా అమలు చేశారు. ఇదే నమూనాను త్వరలో రాష్ట్రంలో ప్రారంభించబోయే కొత్త ఎన్‌హెచ్‌ఏఐ రహదారులపై కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా ఆర్‌ఆర్‌ఆర్‌ (రీజినల్‌ రింగ్‌ రోడ్‌) ఉత్తర భాగం పనుల్లో ఈ సాంకేతికత వినియోగంపై కేంద్రం దృష్టి కేంద్రీకరించింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగేడ్‌పల్లి వరకు సుమారు 161.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఆరు లేన్ల రహదారిపై ఏఐ ఆధారిత వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాట్లు ప్రారంభించింది.

వివరాలు 

232 కిలోమీటర్ల పొడవున ఈ టెక్నాలజీ

అదేవిధంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లకు విస్తరించేందుకు సిద్ధం చేసిన డీపీఆర్‌లో కూడా సాంకేతిక వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 232 కిలోమీటర్ల పొడవున ఈ టెక్నాలజీ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అడ్వాన్స్డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏటీఎంఎస్‌) ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీస్‌, రవాణా శాఖలతో భద్రతా వ్యవస్థలను అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై కూడా కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ పరిధిలో ఉన్న మొత్తం 251 కిలోమీటర్ల రహదారిపై పూర్తి స్థాయిలో ఆధునిక టెక్నాలజీ అమలు చేయాలని భావిస్తున్నారు.

వివరాలు 

ఏఐ టెక్నాలజీ ప్రత్యేకతలు

ఈ ఏఐ ఆధారిత సాంకేతికతలో భాగంగా రహదారి మొత్తం పొడవున అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేస్తారు. వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించినప్పుడు ఈ కెమెరాలు వాటిని వెంటనే గుర్తిస్తాయి. తద్వారా ఆ వాహన యజమానుల చిరునామాలకు ఆటోమేటిక్‌గా చలాన్లు పంపించే విధానం అమల్లోకి వస్తుంది.

Advertisement