Page Loader
Telangana: వానాకాలం నుంచి పంటల బీమా.. పథకం అమలుకు ముందుకొచ్చిన ఏఐసీ
వానాకాలం నుంచి పంటల బీమా.. పథకం అమలుకు ముందుకొచ్చిన ఏఐసీ

Telangana: వానాకాలం నుంచి పంటల బీమా.. పథకం అమలుకు ముందుకొచ్చిన ఏఐసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వచ్చే వానాకాలం నుంచి ప్రారంభించనున్న పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి భారతీయ వ్యవసాయ బీమా సంస్థ (ఏఐసీ) ముందుకొచ్చింది. ప్రైవేటు బీమా సంస్థల కంటే లాభదాయకంగా,రైతులకు ఎక్కువ మేలు చేసేలా,ప్రభుత్వానికి జవాబుదారీగా ఈ పథకాన్ని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏఐసీ ప్రతిపాదించింది. ఇప్పటికే బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేపట్టగా,ఏఐసీ ప్రతిపాదనపై నిపుణులతో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో 2021 నుంచి పంటల బీమా పథకం అమలు కాలేదు. వచ్చే వానాకాలం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. బీమా ప్రీమియాన్ని తమకు భారం వేయకుండా రైతులకు ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది.

వివరాలు 

ఆచితూచి ప్రభుత్వ స్పందన.. 

నిబంధనల ప్రకారం, ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి ఏఐసీ తమ ప్రతిపాదనను వివరించింది. గతంలో రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల ద్వారా బీమా పథకం అమలు చేయగా,అది విఫలమైందని తెలిపింది. ప్రైవేటు సంస్థలకు విశ్వసనీయత లేదని,బీమా ద్వారా వాటికే అధిక లాభం వస్తోందని పేర్కొంది. గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా పంటల బీమాకు ప్రైవేటు సంస్థలకు రూ.28 వేల కోట్ల ప్రీమియం చెల్లించినా, అందులో కేవలం రూ.7,650 కోట్ల క్లెయిమ్‌లు మాత్రమే కంపెనీలు చెల్లించాయని వివరించింది.

వివరాలు 

నిపుణులతో అధ్యయనానికి సర్కారు నిర్ణయం 

ఏఐసీ మాత్రం ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రీమియంలో క్లెయిమ్‌లను తక్కువగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి ఇవ్వడం వలన, అది వ్యవస్థకు మరింత లాభదాయకంగా ఉంటుందని పేర్కొంది. ప్రైవేటు సంస్థల కంటే జవాబుదారీగా, క్రమబద్ధంగా పనిచేస్తుందని తెలిపింది. ఏఐసీ ఈ పథకాన్ని ఆశించిన విధంగా అమలు చేస్తుందా? వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలయ్యింది? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. దీనిపై నిపుణులతో పరిశీలన చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కూడా ఈ అంశంపై అధ్యయనం జరుపుతున్నారు. విస్తృతంగా చర్చించిన తర్వాత, అన్నదాతలకు సరైన ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.