AIIMS: ఎయిమ్స్ వైద్యుల అద్భుతం.. 209 కిలోల ఊబకాయ రోగికి విజయవంతమైన బేరియాట్రిక్ సర్జరీ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి 209 కిలోల బరువున్న వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఏకంగా 32 రోజుల పాటు ప్రత్యేక వైద్య ప్రణాళికతో సర్జరీకి సిద్ధం చేసి ఈ అరుదైన ఘనత సాధించారు. శస్త్రచికిత్స అనంతరం కేవలం 14 రోజుల్లోనే ఆ వ్యక్తి 49 కిలోల బరువు తగ్గడం విశేషంగా నిలిచింది. వివరాల ప్రకారం.. 32 ఏళ్ల వివేక్ అనే యువకుడు 209 కిలోల బరువుతో తీవ్ర ఊబకాయ సమస్యతో పాటు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు.
వివరాలు
ట్రాకియోస్టోమీతో శ్వాస అందించే ఏర్పాట్లు
అతని బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 74గా నమోదైంది. అధిక రక్తపోటు, ప్రీ-డయాబెటిస్, ప్రాణాంతక అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి సమస్యలు అతని ఆరోగ్యాన్ని మరింత విషమం చేశాయి.
నిద్రలో శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో వైద్యులు ట్రాకియోస్టోమీ చేసి నిరంతర శ్వాస అందించే ఏర్పాట్లు చేశారు.
అంతేకాదు,అతని పొట్ట చుట్టుకొలత 198 సెంటీమీటర్లు ఉండటంతో సాధారణ ఆపరేషన్ టేబుల్‌పై సురక్షితంగా పడుకోబెట్టడం కూడా వైద్యులకు పెద్ద సవాలుగా మారింది.
రోగి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎయిమ్స్ వైద్యులు మల్టీ-డిసిప్లినరీ బృందంగా ఏర్పడి సమగ్ర చికిత్స ప్రణాళికను అమలు చేశారు.
వివరాలు
ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకొని ప్రస్తుతం సొంతంగా నడవగలుగుతున్న యువకుడు
32రోజుల పాటు తక్కువ కేలరీల ఆహారం అందించడంతో పాటు రెస్పిరేటరీ ఫిజియోథెరపీ,ఇన్‌ఫెక్షన్ నియంత్రణ, ప్రత్యేక పోషకాహార మద్దతు వంటి చికిత్సలు అందించారు.
దీంతో రోగి బరువు, పొట్ట చుట్టుకొలత కొంత మేర తగ్గి శస్త్రచికిత్సకు అనువైన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఏడాది జులై 24న వైద్యుల బృందం 'లాప్రోస్కోపిక్ వన్ అనస్టోమోసిస్ గ్యాస్ట్రిక్ బైపాస్' అనే అధునాతన బేరియాట్రిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
ఆపరేషన్ అనంతరం వేగంగా కోలుకున్న వివేక్, ఆగస్టు 6న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయానికి 160 కిలోలకు చేరుకున్నాడు.
అతని పొట్ట చుట్టుకొలత కూడా 198సెంటీమీటర్ల నుంచి 155సెంటీమీటర్లకు తగ్గింది.
ప్రస్తుతం అతను ఎలాంటి సహాయం లేకుండానే స్వయంగా శ్వాస తీసుకుంటూ నడవగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు.
వివరాలు
రోగి ఆరోగ్య పరిస్థితిని రానున్న రోజుల్లో కూడా నిరంతరం పర్యవేక్షణ
ఈ శస్త్రచికిత్సకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ డాక్టర్ మంజునాథ్ మారుతి పోల్ మాట్లాడుతూ.. తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు శస్త్రచికిత్సకు ముందు శాస్త్రీయ ప్రణాళికతో వారిని సిద్ధం చేయడం ఎంత కీలకమో ఈ కేసు స్పష్టంగా నిరూపించిందన్నారు.
రోగి ఆరోగ్య పరిస్థితిని రానున్న రోజుల్లో కూడా నిరంతరం పర్యవేక్షిస్తామని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు.