LOADING...
Air India: గంజాయి కేసులో చిక్కిన ఎయిర్ ఇండియా కోపైలట్‌.. వెనక్కి పంపిన అమెరికా
గంజాయి కేసులో చిక్కిన ఎయిర్ ఇండియా కోపైలట్‌.. వెనక్కి పంపిన అమెరికా

Air India: గంజాయి కేసులో చిక్కిన ఎయిర్ ఇండియా కోపైలట్‌.. వెనక్కి పంపిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2026
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కోపైలట్‌ శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో గంజాయితో పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఆయన విధుల్లో భాగంగా ప్రయాణికుల విభాగంలో దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో అదే విమానాన్ని నడపాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉండింది. ఈ నేపథ్యంలో శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన సాధారణ తనిఖీల్లో అధికారులు కోపైలట్‌ బ్యాగును పరిశీలించగా గంజాయి బయటపడింది. దీంతో వెంటనే సంబంధిత విషయాన్ని ఎయిరిండియాకు తెలియజేశారు. అనంతరం అమెరికా అధికారులు అతడిని ఆ విమానంలో కాకుండా వేరే విమానంలో భారత్‌కు పంపించారు. ఏప్రిల్‌ 14న జరిగిన ఈ ఘటనపై ఎయిరిండియా సంస్థ పౌర విమానయాన నియంత్రణ సంస్థకు ఫిర్యాదు చేసింది.

వివరాలు 

డిసెంబర్‌ 2025లో కూడా ఇలాంటి ఘటన

ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. చట్ట ఉల్లంఘనలను తాము ఏమాత్రం ఉపేక్షించబోమని పేర్కొంది. సంస్థ నియమావళి ప్రకారం ఆ కో పైలట్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇదిలా ఉండగా, గతంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్‌ 2025లో వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానానికి చెందిన ప్రధాన పైలట్‌ మద్యం పరీక్షల్లో విఫలమయ్యాడు. రెండు సార్లు పరీక్షలు నిర్వహించినప్పటికీ ఫలితం ఒకటే రావడంతో కెనడా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement