Air India Crash: అక్టోబర్ నాటికి ఎయిర్ ఇండియా ప్రమాదంపై తుది ముసాయిదా నివేదిక: AAIB
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు తుది దశకు చేరుకుందని,ఈ కేసుకు సంబంధించిన డ్రాఫ్ట్ తుది నివేదిక (Draft Final Report) అక్టోబర్ 2026 నాటికి సిద్ధమవుతుందని విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) సుప్రీంకోర్టుకు తెలిపింది. 2025 జూన్ 12న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డులు (Cockpit Voice Recordings) లేదా ఇతర సున్నితమైన దర్యాప్తు సమాచారాన్ని బాహ్య సంస్థలకు గానీ, ప్రజలకు గానీ వెల్లడించడం చట్టపరంగా సాధ్యం కాదని AAIB కోర్టుకు స్పష్టం చేసింది. ఇందుకు చట్టంలో పూర్తి నిషేధం ఉందని పేర్కొంది.
వివరాలు
విమాన భద్రతను బలోపేతం చేయడమే AAIB ప్రధాన ఉద్దేశ్యం
ఈ దర్యాప్తు కేవలం భారతదేశానికి సంబంధించినది మాత్రమే కాదని, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) రూపొందించిన చికాగో కన్వెన్షన్, అనెక్స్-13 నిబంధనల ప్రకారం జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి విచారణ అని AAIB వివరించింది.
ప్రమాదం జరిగిన దేశం తప్పనిసరిగా ప్రమాద పరిస్థితులపై అధికారిక దర్యాప్తు చేపట్టాలని చికాగో కన్వెన్షన్‌లోని ఆర్టికల్-26 పేర్కొంటుందని తెలిపింది.
అందువల్ల ఇది కేవలం దేశీయ విచారణ కాదని, అంతర్జాతీయ ఒప్పందాల ఆధారంగా నిర్వహిస్తున్న ప్రక్రియ అని కోర్టుకు వివరించింది.
విమాన ప్రమాదాల దర్యాప్తు నిందితులను గుర్తించడం కోసం కాదని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విమాన భద్రతను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని AAIB వెల్లడించింది.
వివరాలు
అక్టోబర్ 2026లో డ్రాఫ్ట్ తుదినివేదిక
ప్రస్తుతం కొన్ని బాహ్య అంశాలు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ,మరో ఆరు వారాల్లో దర్యాప్తు ప్రక్రియలోని ప్రధాన పనులు ముగుస్తాయని తెలిపింది.
అనంతరం విశ్లేషణ పూర్తిచేసి అక్టోబర్ 2026లో డ్రాఫ్ట్ తుదినివేదిక సిద్ధం చేయనున్నట్లు కోర్టుకు వెల్లడించింది.
ఈ కేసులో పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్,అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది.
ఈప్రమాదంపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయస్థానం పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.
ఇప్పటికే విచారణ సందర్భంగా కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌ను ప్రమాదానికి ముందుగానే బాధ్యుడిగా చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రమాదంపై నిష్పాక్షికంగా, పారదర్శకంగా,సాంకేతికంగా పటిష్ఠమైన దర్యాప్తు జరగాలని పుష్కరాజ్ సభర్వాల్ తనపిటిషన్‌లో కోరారు.