Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు.. అదుపులో సిబ్బంది
ఈ వార్తాకథనం ఏంటి
డమ్మామ్ నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో 'బాంబ్' అని రాసి ఉన్న బెదిరింపు నోట్ కలకలం రేపింది. సోమవారం విమానం టాయిలెట్‌లో ఈ నోట్‌ను సిబ్బంది గుర్తించారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. క్రైమ్ బ్రాంచ్ కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఓ సిబ్బంది,ఓ ప్రయాణికుడిని పోలీసులు విచారిస్తున్నారు. విమానంలో మొత్తం ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. నోట్‌పై ఉన్న చేతిరాతను ప్రాథమికంగా పరిశీలించగా.. సిబ్బందిలో ఒకరి చేతిరాతతో 60-70 శాతం వరకు పోలిక ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాలు
అహ్మదాబాద్ నుంచి వెళ్లేందుకు ఏడుగురు సిబ్బందికి అనుమతి
మిగిలిన ఏడుగురు సిబ్బందిని అహ్మదాబాద్ నుంచి వెళ్లేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది.
మరోవైపు విమాన ప్రయాణంలో పలుమార్లు టాయిలెట్‌కు వెళ్లిన ఓ ప్రయాణికుడిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
నోట్‌ను ఎవరు టాయిలెట్‌లో పెట్టారు? ఘటనకు ముందు, తర్వాత అనుమానితుల కదలికలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇద్దరి కదలికలను పరిశీలిస్తూ అసలు నోట్ ఎవరు పెట్టారన్న విషయాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు.
వివరాలు
దర్యాప్తులో తేలే అంశాల ఆధారంగా చర్యలు
దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
ఆగస్టు 31న డమ్మామ్ నుంచి దిల్లీకి నడిచిన తమ విమానానికి సంబంధించిన భద్రతా ఘటనపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
ప్రయాణికులు, సిబ్బంది, విమాన కార్యకలాపాల భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలనైనా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది.
దర్యాప్తులో తేలే అంశాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
విమానం అహ్మదాబాద్‌లో అత్యవసరంగా దిగిన తర్వాత మొత్తం 32 మంది ప్రయాణికులను టెర్మినల్-2లో సురక్షితంగా కిందికి దించారు.
అనంతరం భద్రతా సంస్థలు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విమానంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు.