Iran Protests: ఇరాన్ గగనతలం మూసివేత.. ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ
ఈ వార్తాకథనం ఏంటి
హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు తాత్కాలికంగా మూసివేసింది. ఈ పరిణామంతో భారత విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక అడ్వైజరీలను జారీ చేశాయి. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొన్ని విమానాలను ఇతర మార్గాల ద్వారా మళ్లించగా, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులపై ఎయిర్ ఇండియా స్పందించింది. ప్రయాణికులు,సిబ్బంది భద్రతే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతున్నామని వెల్లడించింది. అయితే, దారి మార్పు సాధ్యం కాని కొన్ని విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపింది.
వివరాలు
ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసిన ఇండిగో
ప్రయాణికులు తాజా సమాచారాన్ని తరచూ పరిశీలించాలని కోరింది. ఈ కారణంగా కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కూడా తెలిపింది. ఇండిగో విమానయాన సంస్థ కూడా ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయని పేర్కొంది. పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ, అవసరమైన చోట్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలను నడుపుతున్నామని వెల్లడించింది. ఈ సమయంలో ప్రయాణికులు సహకరించాలని కోరింది.
వివరాలు
అప్రమత్తమైన భారత్
ఇటీవలి రోజులుగా ఇరాన్‌లో జరుగుతున్న హింసాత్మక ఆందోళనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అదే సమయంలో, ఆ దేశంపై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతోందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని వీలైనంత త్వరగా దేశం విడిచిపోవాలని సూచించింది. అలాగే, భారతీయులు ఎవరూ ఇరాన్‌కు ప్రయాణం చేయవద్దని స్పష్టంగా పేర్కొంది.