Air pollution: దేశంలోని 10 నగరాల్లో ఏడు శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం, అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో తెలుసా?
Air pollution: భారతదేశంలోని 10 ప్రధాన నగరాల్లో 7 శాతానికి పైగా వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్నాయని ఓ అధ్యయనంలో తెలింది. ఈ మరణాల్లో దిల్లీ టాప్‌లో ఉందని "ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్" జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సురక్షిత ఎక్స్‌పోజర్ పరిమితులను మించిన PM2.5 సాంద్రతలే దీనికి కారణమని అధ్యయనం చెబుతోంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణె, సిమ్లా, వారణాసిలో డేటాను అధ్యయనం విశ్లేషించింది. పీఎం2.5 స్థాయిలు డబ్ల్యూహెచ్ఓ సురక్షిత పరిమితి కంటే క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది.
టాప్‌లో దిల్లీ
పీఎం2.5 వాయు కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 12,000 మరణాలు నమోదవుతున్నందున రోజువారీ, వార్షిక మరణాల్లో దిల్లీ టాప్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇది మొత్తం మరణాల్లో 11.5 శాతం. పీఎం2.5కి ఎక్కువ బహిర్గతం కావడం వల్ల మరణ ప్రమాదం పెరుగుతుంది. స్థానిక కాలుష్యం ప్రధాన కారణాలలో ఒకటి. పీఎం2.5 సాంద్రతలలో క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాముల పెరుగుదల రోజువారీ మరణాలలో 1.4 శాతం పెరుగుదలతో సంబంధం కలిగి ఉందని అధ్యయనం వెల్లడించింది. భారత వాయు నాణ్యత ప్రమాణాల కంటే తక్కువ స్థాయికి పరిశీలనలు పరిమితమైనప్పుడు, ఈ ప్రమాదం 2.7 శాతానికి రెట్టింపు అవుతుంది.
కాలుష్య నియంత్రణకు సమర్థవంతమైన పద్ధతులు అవసరం
దిల్లీలో పీఎం2.5 స్థాయిల్లో క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాముల పెరుగుదల రోజువారీ మరణాలలో 0.31 శాతం పెరుగుదలకు దారితీసింది. బెంగళూరులో ఈ పెరుగుదల 3.06 శాతంగా ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన సహ రచయిత జోయెల్ స్క్వార్ట్జ్ గాలి నాణ్యత పరిమితులను తగ్గించడం, కఠినతరం చేయడం వల్ల సంవత్సరానికి వేలాది మంది ప్రాణాలను రక్షించవచ్చని నొక్కి చెప్పారు. ఇప్పటికే ప్రపంచంలోని ఇతర దేశాల్లో కాలుష్య నియంత్రణకు సమర్థవంతమైన పద్ధతులు అవలంబిస్తున్నాయని, వాటిని భారత్‌లో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2008 నుంచి 2019 వరకు పది భారతీయ నగరాల్లో దాదాపు 36 లక్షల రోజువారీ మరణాలను అధ్యయనం విశ్లేషించింది.
పీఎం2.5 స్థాయిల వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్
బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి మరియు సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్, న్యూఢిల్లీ పరిశోధకులు కూడా ఈ అంతర్జాతీయ బృందంలో భాగమయ్యారు. భూమిపై ఉన్న దాదాపు ప్రతి వ్యక్తి సిఫార్సు చేయబడిన స్థాయిల కంటే ఎక్కువ వాయు కాలుష్యానికి గురవుతారు. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. పీఎం2.5 కణాలకు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అనేక ఇతర శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఈ అధ్యయనం భారతదేశంలో పీఎం2.5కి స్వల్పకాలిక బహిర్గతం, రోజువారీ మరణాల మొదటి బహుళ-నగర సమయ శ్రేణి విశ్లేషణ. ఇది వాయు కాలుష్యం తీవ్రత, దాని సంబంధిత ఆరోగ్య సమస్యలను హైలైట్ చేస్తుంది.