LOADING...
Air Pollution: తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత.. హైదరాబాద్‌లో ఐదు రోజుల్లో 50% తగ్గుదల 
హైదరాబాద్‌లో ఐదు రోజుల్లో 50% తగ్గుదల

Air Pollution: తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత.. హైదరాబాద్‌లో ఐదు రోజుల్లో 50% తగ్గుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో గాలి నాణ్యత రోజు రోజుకీ క్షీణిస్తోంది. నవంబర్‌ 5న 68గా ఉన్న గాలి నాణ్యత సూచీ (AQI) 11వ తేదీకి 102 పాయింట్లకు పెరిగింది. ముఖ్యంగా జూపార్క్‌ (164), ఇక్రిశాట్‌ (142), ఐడీఏ పాశమైలారం (136) ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రంగా నమోదైంది. వైద్యుల సూచన ప్రకారం, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, ఆస్తమా లేదా హృద్రోగం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాస్క్‌లు వాడుతూ జాగ్రత్తలు పాటించాలని, దుమ్ము లేదా పొగ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపరాదని సూచిస్తున్నారు.

వివరాలు 

ఉష్ణోగ్రతలు తగ్గడంతో కాలుష్య ప్రభావం పెరుగుతోంది 

వాతావరణ ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గాలి కాలుష్యం వేగంగా పెరుగుతోంది. హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో వాయు నాణ్యతలో స్పష్టమైన దిగజారుడు కనిపిస్తోంది. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత ఆందోళనకరంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 254 నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను నిత్యం పర్యవేక్షించే ఆన్‌లైన్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అక్కడ సేకరించిన గాలి నాణ్యత సూచీని (AQI) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విశ్లేషించి ప్రతి 24 గంటలకు ఒకసారి బులెటిన్‌ రూపంలో ప్రకటిస్తుంది. మంగళవారం విడుదలైన బులెటిన్‌ ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు.

వివరాలు 

ఉష్ణోగ్రతలు తగ్గడంతో కాలుష్య ప్రభావం పెరుగుతోంది 

తిరుపతి: నవంబర్‌ 1న 85గా ఉన్న AQI, 11వ తేదీ నాటికి 216కు ఎగసింది. ఇక్కడ గాలి నాణ్యత 'సంతృప్తికరం' స్థాయిలోనుండి 'పూర్‌' స్థితికి చేరింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఆస్తమా లేదా హృద్రోగులు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. విశాఖపట్నం: ఇక్కడ గాలి నాణ్యత మధ్యస్థంగా ఉన్నప్పటికీ, 190 పాయింట్లతో 'పూర్‌' స్థితికి చాలా దగ్గరగా ఉంది. సాధారణ ప్రజలకు పెద్ద ప్రమాదం లేకపోయినా, పిల్లలు, వృద్ధులు, రోగులు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని సూచన.

వివరాలు 

ఉష్ణోగ్రతలు తగ్గడంతో కాలుష్య ప్రభావం పెరుగుతోంది 

రాజమహేంద్రవరం: కొద్ది రోజుల వ్యవధిలో గాలి నాణ్యత 'గుడ్‌' నుంచి 'మధ్యస్థం' స్థాయికి పడిపోయింది. ఇది సాధారణ ప్రజలకు పెద్ద ముప్పు కాకపోయినా, శ్వాసకోశం లేదా హృద్రోగ సంబంధిత సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలి. విజయవాడ: నగర సగటు AQI 91గా నమోదై సంతృప్తికర స్థాయిలో ఉన్నప్పటికీ, 'మధ్యస్థం' స్థితికి దగ్గరగా ఉంది. మొత్తం నగర గాలి స్థితి తగినంత బాగున్నా, రాజీవ్‌నగర్‌ ప్రాంతంలో మాత్రం కాలుష్యం ఎక్కువగా కనిపిస్తోంది.

వివరాలు 

పాయింట్లకు అనుగుణంగా గ్రేడింగ్‌ 

వాయుకాలుష్య లెక్కల్లో గాలి నాణ్యత సూచీలో నమోదయ్యే పాయింట్లే కీలకం. పాయింట్ల లెక్కలను బట్టి గాలి నాణ్యతకు గ్రేడింగ్‌ ఇస్తారు. ఇవీ వివరాలు... గుడ్‌ (0-50): గాలి నాణ్యత చాలా బాగున్నట్లు. ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉండదు. సంతృప్తికరం (51-100): గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉన్నట్లు.పిల్లలు,వృద్ధులు,ఊపిరితిత్తుల సమస్యలుండే వారికి కొంత అసౌకర్యంగా ఉంటుంది. మధ్యస్థం (101-200): ఊపిరితిత్తులు,గుండె సమస్యలు ఉన్నవారికి శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. పూర్‌ (201-300):ఈ వాతావరణంలో చాలామందికి శ్వాస సంబంధిత అసౌకర్యం కలుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి మరింత ఇబ్బందికరం. వెరీ పూర్‌ (301-400): గాలి నాణ్యత అధ్వానంగా ఉన్నట్లు.దీర్ఘకాలం ఇలాంటి వాతావరణం కొనసాగితే శ్వాస సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం ఎక్కువ. సివియర్‌ (400+):ఈ గాలి అత్యంత ప్రమాదకరం.