Hyderabad Pollution: రోజురోజుకూ హైదరాబాద్'లో పెరుగుతున్న కాలుష్యం.. ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువ!
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరుగుతున్నట్లు ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన డేటా వెల్లడించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత "మోడరేట్","పూర్" స్థాయిల్లో ఉందని తెలిపింది. నవంబర్ నెలలో గాలి నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని, కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. సనత్‌నగర్ ప్రాంతంలో గాలి నాణ్యత మరింత క్షీణించిందని, నవంబర్ 30న "పూర్ ఎయిర్ క్వాలిటీ" నమోదైనట్లు పేర్కొంది. జూ పార్క్ ప్రాంతంలో నవంబర్ 28, 29, 30 తేదీల్లో గాలి నాణ్యత సూచికలు 167, 167, 163గా నమోదయ్యాయి, ఇవి మోడరేట్ కేటగిరీలోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.
ఇతర ప్రదేశాల్లో కూడా గాలి నాణ్యత "మోడరేట్" స్థాయిల్లోనే
బొల్లారం పారిశ్రామిక జోన్, ఇక్రిసాట్ పటాన్‌చెరు, న్యూ మలక్‌పేట్, సోమాజిగూడ, సెంట్రల్ యూనివర్శిటీ, రామచంద్రపురం, నాచారం, ఈసీఐఎల్, కాప్రా, కోకాపేట్, కొంపల్లి మున్సిపాలిటీ, ఐఐటిహెచ్ వంటి ఇతర ప్రదేశాల్లో కూడా గాలి నాణ్యత "మోడరేట్" స్థాయిల్లోనే ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత క్షీణించిందని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఎయిర్ క్వాలిటీ సూచిక: 0-50: బాగుంది 50-100: మితమైన కాలుష్యం 100-200: పూర్ ఎయిర్ 200-300: అనారోగ్యకరమైనది 300-400: తీవ్రమైన కాలుష్యం 400-500+: ప్రమాదకరమైన కాలుష్యం
మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి: సురేఖ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ రోజు సందర్భంగా, "స్వచ్ఛమైన గాలి, పచ్చని భూమి-సుస్థిరమైన జీవనం వైపు అడుగు" అనే ప్రతిపాదనతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలందరూ మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవ్వాలని ఆమె అభ్యర్థించారు.