Page Loader
కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా
కాంగ్రెస్‌ పార్టీకి ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ రాజీనామా

కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా

వ్రాసిన వారు Stalin
Jan 25, 2023
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లోని తన పదవులన్నింటిని వదులుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. బీబీసీ డాక్యుమెంటరీని వ్యతిరేకించడమే ఆయన రాజీనామాకు కారణం కావడం గమనార్హం. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించింది. ప్రస్తుతం మొదటి ఎపిసోడ్ విడుదల కాగా, కేంద్రం ఆవీడియోపై నిషేధం విధించింది. డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్ పోస్ట్ చేశారు. అయితే తన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనిల్‌పై ఒత్తిడి తెచ్చింది.

కేరళ

ప్రేమను చూపిన వాళ్లే, ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు: అనిల్

తన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినట్లు అనిల్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారి నుంచి ఇలాంటి ప్రతిపాదన వచ్చినట్లు పేర్కొన్నారు. వారి ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు వివరించారు. సోషల్ మీడియాలో నిన్న వరకు తనపై ప్రేమను ప్రచారం చేసిన వాళ్లే, ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అందుకే కేపీసీసీ డిజిటల్ మీడియా కన్వీనర్, ఏఐసీసీ సోషల్ మీడియా- డిజిటల్ కమ్యూనికేషన్ సెల్ జాతీయ కో ఆర్డినేటర్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్‌లో ఆయన ప్రకటించారు. బీబీసీ డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌లోని పలు విభాగాలు ప్రకటించిన మరుసటి రోజే ఆ పార్టీకి చెందిన కీలక నేత రాజీనామా చేయడం గమనార్హం.