జేఎన్‌యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో మంగళవారం రాత్రి హై డ్రామా జరిగింది. వామపక్ష విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో బీబీసీ డాక్యుమెంటరీని చూసేందుకు గుమికూడగా వారిపై రాళ్లదాడి జరిగింది. దీంతో జేఎన్‌యూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో క్యాంపస్‌లో మంగళవారం రాత్రి 9 గంటలకు విద్యార్థి సంఘం కార్యాలయంలో బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోడీ క్వశ్చన్' ప్రదర్శిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. డాక్యుమెంటరీని ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో, ప్రదర్శనను అడ్డుకునేందుకు రాత్రి 8.30 గంటల సమయంలో క్యాంపస్‌లో విద్యుత్‌ను నిలిపివేశారు.
వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు
జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ క్యాంపస్‌లో కరెంటు లేకపోవడంతో మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో డాక్యుమెంటరీని చూడటానికి విద్యార్థులు గుమిగూడారు. ఈ క్రమంలో వారిపై రాళ్లదాడి జరిగింది. తమ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లో డాక్యుమెంటరీ చూస్తుండగా తమపై రాళ్ల దాడి జరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. క్యాంపస్‌లో కరెంటు లేకపోవడంతో రాళ్లు రువ్విన వ్యక్తులను గుర్తించలేకపోయినట్లు వారు పేర్కొన్నారు. దిల్లీ పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఐషే ఘోష్ కోరారు. అయితే విద్యార్థులు ఫిర్యాదు చేస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.