LOADING...
Al Falah University: అల్‌-ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు 'న్యాక్‌' 
అల్‌-ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు 'న్యాక్‌'

Al Falah University: అల్‌-ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు 'న్యాక్‌' 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో అల్‌-ఫలా విశ్వవిద్యాలయం మరోసారి ప్రధానాంశంగా మారింది. ఈ ఘటనలో ఆ విద్యాసంస్థకు చెందిన కొందరు వైద్యులు నిందితులుగా ఉన్నారన్న అనుమానాల కారణంగా విశ్వవిద్యాలయం చర్చలో నిలిచింది. ఈ పరిణామాల మధ్య, జాతీయ మూల్యాంకన, ప్రమాణీకరణ మండలి (న్యాక్) ఆ విశ్వవిద్యాలయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచురించారనే కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు న్యాక్ తెలిపింది.

వివరాలు 

76 ఎకరాల విస్తీర్ణంలో అల్‌-ఫలా విశ్వవిద్యాలయం

న్యాక్ విడుదల చేసిన నోటీసుల్లో.. "అల్‌-ఫలా యూనివర్సిటీకి మా గుర్తింపు లేనప్పటికీ, లేక అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేయకపోయినా, తమ వెబ్‌సైట్‌లో గుర్తింపు పొందిన విద్యాసంస్థగా ప్రదర్శించింది. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే చర్య. దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు తప్పు సమాచారాన్ని నమ్మే అవకాశం ఉంది" అని పేర్కొంది. హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లా ధౌజ్ గ్రామం పరిధిలో సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో అల్‌-ఫలా విశ్వవిద్యాలయం ఉంది. ఇది హరియాణా ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం ఆధారంగా స్థాపించబడింది.

వివరాలు 

2014లో విశ్వవిద్యాలయ హోదా కల్పించింది

మొదటగా 1997లో ఇంజినీరింగ్ కాలేజీగా ప్రారంభమైంది. అనంతరం, 2013లో న్యాక్ నుంచి 'ఏ' గ్రేడ్ పొందిందని కొన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తరువాత 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విశ్వవిద్యాలయ హోదా కల్పించింది. ఈ సంస్థకు అనుబంధంగా 2019లో అల్‌-ఫలా మెడికల్ కాలేజీను ప్రారంభించారు. తమది గుర్తింపు పొందిన విద్యాసంస్థ అని యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటనల్లో కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే, న్యాక్ తాజా షోకాజ్ నోటీసులు విశ్వవిద్యాలయానికి చేరాయి.