Red Fort blast: ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్.. 'అల్-ఫలాహ్ యూనివర్సిటీ'పై దర్యాప్తు ఏజెన్సీల ఫోకస్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన (Red Fort Blast) నేపధ్యంలో దర్యాప్తు సంస్థల దృష్టి ఇప్పుడు ఫరీదాబాద్‌లోని 'అల్-ఫలాహ్ యూనివర్సిటీ'పై కేంద్రీకృతమైంది. వైద్యులు, బోధకుల వేషంలో కొంతమంది వ్యక్తులు ఈ విద్యాసంస్థను తమ ఉగ్ర కార్యకలాపాలకు వేదికగా మార్చుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు జామియా మిలియా మరియు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ విశ్వవిద్యాలయం, ఇప్పుడు ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో వార్తల్లోకి వచ్చి, విద్యార్థుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పుడు అందరి ప్రశ్న - ఈ యూనివర్సిటీని నడిపేది ఎవరు?
వివరాలు
ఇంజినీరింగ్ కాలేజీగా మొదలై..
హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ జిల్లా ధౌజ్ గ్రామంలో 76 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్సిటీ, మొదటగా 1997లో ఇంజినీరింగ్ కాలేజీగా ప్రారంభమైంది. హరియాణా ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం కింద ఈ సంస్థ స్థాపించబడింది. 2013లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)కి చెందిన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) నుండి 'A' గ్రేడ్ రేటింగ్ పొందింది. తర్వాత, 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా గుర్తించింది. తరువాత, 2019లో ఈ యూనివర్సిటీ పరిధిలోనే అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించారు.
వివరాలు
ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ..
దిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యూనివర్సిటీ, మైనార్టీ విద్యార్థులకు గతంలో ప్రముఖ ప్రత్యామ్నాయ విద్యాసంస్థగా ఉండేది. దీన్ని అల్-ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ 1995లో స్థాపించబడింది. యూనివర్సిటీతో పాటు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్సాలు, అనాథాశ్రమాలు,పాఠశాలలు,ఇతర సేవా సంస్థలు కూడా నడుస్తున్నాయి. యూనివర్సిటీ ప్రాంగణంలోనే 650 పడకల ఆసుపత్రి ఉంది. ఇక్కడ రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. క్యాంపస్‌లో ఐదు బ్యాచ్‌లుగా ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి బ్యాచ్‌లో 150-200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం జావెద్ అహ్మద్ సిద్దిఖీ ఈ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్నారు.
వివరాలు
విద్యార్థుల్లో భయం,ఆందోళన
ఆయన అల్-ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్‌లో మ్యానేజింగ్ ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు. అతను పలు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నాడు. అల్-ఫలాహ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆర్థిక అక్రమాల కేసులో సిద్దిఖీ ఒకసారి అరెస్టయినట్లు సమాచారం వెల్లడైంది. దిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో ఉపయోగించిన కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ, ఇదే యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు. అదే యూనివర్సిటీకి చెందిన మరో ఇద్దరు వైద్యులు ముజమ్మిల్ షకీల్,షాహీన్ షాహిద్లు 2,900 కిలోల పేలుడు పదార్థాల కేసులో పోలీసుల చేత అరెస్టయ్యారు. ఈ పరిణామాల అనంతరం దర్యాప్తు సంస్థలు మంగళవారం నుంచి యూనివర్సిటీ ప్రాంగణంలో విస్తృత సోదాలు చేపట్టాయి.
వివరాలు
విద్యార్థుల్లో టెన్షన్..
ఉమర్, ముజమ్మిల్ నివాస గదులను పరిశీలించి, వైద్యులు మరియు సిబ్బందిని విచారిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామం కారణంగా విద్యార్థుల్లో భయం, అనిశ్చితి వాతావరణం నెలకొంది. "ముజమ్మిల్ ఎమర్జెన్సీ విభాగంలో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తుండేవారు. ఆయనతో మాకు పెద్దగా పరిచయం లేదు. డాక్టర్ ఉమర్ 10 రోజుల క్రితం మాకు ఒక క్లాస్ చెప్పారు. ఆయన ప్రశాంతంగా ఉండేవారు, ఎలాంటి లోపం కనపడలేదు. డాక్టర్ షాహీన్ తరగతులు కూడా రెగ్యులర్‌గా తీసుకునేవారు." వీరి అరెస్టులు తమ భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయని, "ఇప్పుడు ఉద్యోగాలు దొరుకుతాయా లేదా?" అనే భయంతో విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.