Al-Falah University: ఎర్రకోట పేలుడు ఘటన.. అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ హసన్ మిస్సింగ్..?
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఎర్రకోట పేలుడు (Red Fort Blast) జరిగిన తర్వాత, హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ ప్రస్తుతం కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో అతడిపై ఉగ్ర ఆరోపణలు ఉండటం గమనార్హం జాతీయ మాధ్యమాలు వెల్లడించిన వివరాల ప్రకారం- దిల్లీ పేలుడు తర్వాత దర్యాప్తు అధికారులు అల్-ఫలాహ్ యూనివర్సిటీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ పనిచేస్తున్న పలువురిని విచారించారు. ఈ క్రమంలో డాక్టర్ నిసార్ ఆ విద్యాసంస్థలో ఉద్యోగిగా ఉన్నట్టు గుర్తించినట్లు సమాచారం.
వివరాలు
ఆర్టికల్ 311(2)(C) కింద ఉద్యోగం నుంచి తీసేశారు
2023లో ఆయనను కశ్మీర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి విధుల నుంచి తొలగించారు. ఉగ్రముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆర్టికల్ 311(2)(C) కింద ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ నిబంధన కింద భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం నేరుగా ఉద్యోగిని తొలగించే అధికారం కలిగి ఉంటుంది; శాఖాపరమైన విచారణ అవసరం ఉండదు. తర్వాత నిసార్ ఉల్ హసన్ అల్-ఫలాహ్ యూనివర్సిటీలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా నియమితులైనట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. కానీ నవంబర్ 10న జరిగిన పేలుడు ఘటన తరువాత నుంచి ఆయన అదృశ్యమయ్యారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు ఆయన చుట్టూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
వివరాలు
ప్రకటన విడుదల చేసిన అల్-ఫలాహ్ యూనివర్సిటీ
ఇదిలా ఉండగా, విశ్వవిద్యాలయంపై వస్తున్న ఆరోపణల నేపధ్యంలో అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. "మా సంస్థ నుంచి పట్టభద్రులైన విద్యార్థులు భారత్, విదేశాల్లో ప్రసిద్ధ ఆసుపత్రులు, సంస్థల్లో ఉన్నతస్థాయి పదవుల్లో సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటనలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి. ఆ ఘటనలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొన్ని ఆన్‌లైన్ వేదికలు నిరాధార వార్తలను ప్రచారం చేయడం పట్ల మేం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం," అని స్పష్టంచేసింది.