Loading...
Sikkim: ఎడతెరిపిలేని వర్షాలు.. సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. వీడియో వైరల్
ఎడతెరిపిలేని వర్షాలు.. సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. వీడియో వైరల్

Sikkim: ఎడతెరిపిలేని వర్షాలు.. సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

సిక్కింలో ఎడతెరిపిలేని వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వెస్ట్ సిక్కిం జిల్లాలోని యుక్సోమ్-టాషిడింగ్ నియోజకవర్గం పరిధిలో ఉన్న రింబి గ్రామంలో గురువారం రాత్రి భారీ కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయి. కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలు నివాస ప్రాంతాల వైపు దూసుకురావడంతో నష్టం సంభవించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించలేదు. కొండచరియల కారణంగా విద్యుత్ శాఖకు చెందిన ప్రభుత్వ క్వార్టర్లతో పాటు పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారీ వర్షాలకు సిక్కింలో విరిగిపడిన కొండచరియలు

వివరాలు 

సిక్కింలో భారీ వర్షాలు.. నష్టంపై అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు

భారీ వర్షాలు కొనసాగుతుండటంతో మరిన్ని ప్రాంతాల్లో కొండచరియలు కదిలే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఆస్తి నష్టంతో పాటు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది.

సిక్కింలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు, మట్టి ప్రవాహాలు, రహదారులపై శిథిలాలు పేరుకుపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

గ్యాంగ్‌టక్ జిల్లాలో వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టింది.

కబి టింగ్డా ఎమ్మెల్యే త్షెరింగ్ టీ. భూటియా నేతృత్వంలో ఎమ్మెల్యే ఓఎస్డీ, కౌన్సిలర్లు, DDMA అధికారులు,రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ శాఖ ఇంజినీర్లు, రంకా బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి, రెవెన్యూ సర్వేయర్లు కలిసి ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

ADVERTISEMENT

వివరాలు 

అధికారులు విస్తృతంగా నష్టం అంచనా

బుధవారం,గురువారం అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించి కొండచరియలు విరిగిపడిన ప్రదేశాలు, రహదారులపై పేరుకుపోయిన మట్టి, శిథిలాలు, మట్టి ప్రవాహాలు, ఇళ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.

బోజోగారి సమీపంలోని లూయింగ్-రంకా హైవే, లోయర్ బోజోగారి, లింగ్డింగ్, హైకోర్టు రోడ్, టీఎన్‌ఏ గేట్, వీఐపీ కాలనీ, అప్పర్ జడ్-బోజోగారి, పాంగ్‌థాంగ్-లింగ్డోక్ రోడ్, పామ్రో గావ్, లింగ్ పెర్బింగ్, అప్పర్, మిడిల్ లూయింగ్, ఫెంజాంగ్, రంకా, రక్డాంగ్ టింటెక్, దరాగావ్ అప్పర్ బుర్టుక్, సిచే, అరిథాంగ్ ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు.

ADVERTISEMENT

వివరాలు 

రింబి ఘటనపై సీఎం ఆందోళన.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం

కొన్ని రహదారులపై కొండచరియల మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రజా మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. సిచే ప్రాంతంలోని మురుగునీటి శుద్ధి కేంద్రం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

ఎంచే స్కూల్ 33/11 కేవీ స్విచింగ్ స్టేషన్ సమీపంలో భారీగా శిథిలాలు పేరుకుపోవడంతో అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గుర్తించారు.

మరింత వర్షపు నీరు కొండచరియల ప్రాంతాల్లోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో టార్పాలిన్లు ఏర్పాటు చేశారు.

రింబిలో పరిస్థితిపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

గ్యాల్షింగ్ జిల్లాలోని రింబిలో గత రాత్రి భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రభుత్వం నిశితంగా పరిస్థితిని గమనిస్తోందని తెలిపారు.

వివరాలు 

అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన

అధికారులు హైఅలర్ట్‌లో ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.

భారీ వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని సీఎం కోరారు.

కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అనవసర ప్రయాణాలు చేయవద్దని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అస్థిరమైన కొండ వాలుల సమీపంలో నివసించే ప్రజలు నేలలో పగుళ్లు, కొండ కదలికలు, రాళ్లు లేదా మట్టి కిందకు జారడం వంటి ప్రమాద సంకేతాలను గమనించాలని సూచించారు.

ఇలాంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ADVERTISEMENT