LOADING...
Telangana: కొత్త రేషన్‌ కార్డుదారులకు అలర్ట్‌.. ఈ-కేవైసీ లేకపోతే సరుకులు కట్!
కొత్త రేషన్‌ కార్డుదారులకు అలర్ట్‌.. ఈ-కేవైసీ లేకపోతే సరుకులు కట్!

Telangana: కొత్త రేషన్‌ కార్డుదారులకు అలర్ట్‌.. ఈ-కేవైసీ లేకపోతే సరుకులు కట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2025
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కొత్తగా రేషన్‌ కార్డులు పొందినవారు తస్మాత్‌ జాగ్రత్త. ఇకపై ఈ-కేవైసీ పూర్తి చేసినవారికే రేషన్‌ సరుకులు అందుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనికి తుది గడువు ఖరారు చేయకపోయినా, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవడం అవసరం. గడచిన రెండు నెలల్లో కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ-పోస్ యంత్రం ద్వారా బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలని సూచించారు.

Details

రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ-కేవైసీ ప్రక్రియ 

రేషన్‌ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం గత రెండేళ్లుగా పలుమార్లు విజ్ఞప్తి చేస్తూ, గడువులు పొడిగిస్తూ వచ్చింది. కరీంనగర్ జిల్లాలో 3.01 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నవేళ, ఇటీవల 40 వేల మందికి పైగా కొత్త రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. వారికి ఇప్పటికే సెప్టెంబర్‌ నెల బియ్యం కోటా విడుదల చేసి పంపిణీ చేశారు. అదే సమయంలో పాత కార్డుల్లో 32,577 మంది కొత్త కుటుంబ సభ్యుల పేర్లు జత చేశారు. కొత్తగా పేర్లు జోడించుకున్నవారు కూడా తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు తెలిపారు.

Details

ఆధార్‌ అప్‌డేట్ లేక సమస్యలు 

ఆధార్‌ వివరాలు సరిగా అప్‌డేట్‌ చేయకపోవడం వల్ల కొంతమంది ఈ-కేవైసీ ప్రక్రియలో ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అప్డేట్‌ చేయించుకున్నప్పటికీ, వేలిముద్రలు సరిగ్గా నమోదు కాకపోవడంతో ఈ-కేవైసీ తిరస్కరించబడుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. సమస్య కారణం అడగగా, ఆధార్‌ అప్డేట్‌ పూర్తికాలేదని కేంద్రాల వారు సమాధానం ఇస్తున్నారని వారు వాపోతున్నారు. దీంతో ప్రజలు వేర్వేరు ఆధార్‌ కేంద్రాలను తిరుగుతూ అవస్థలు పడుతున్నారు.

Details

ఆధార్‌ కేంద్రాల కొరత

కరీంనగర్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఆధార్‌ కేంద్రాలు లేకపోవడంతో, ప్రజలు ఇతర మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని వారు కోరుతున్నారు. అధికారుల సూచన కొత్త రేషన్‌ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియకు తుది గడువు ఇంకా ఖరారు కాలేదని, కానీ సమయాన్ని వృథా చేయకుండా వెంటనే పూర్తి చేసుకోవడం లబ్ధిదారులకే మేలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు.