పర్యాటకులకు అలర్ట్: నేడు, రేపు పాపికొండల విహార యాత్ర రద్దు
ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాపికొండల విహార యాత్రను యంత్రాంగం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈదురు గాలులతో పాటు పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో సోమవారం, మంగళవారం పాపికొండల యాత్రను రద్దు చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ యాత్రకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో మూడు రోజులు వర్ష సూచన
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మాడ వీధులు జలమయం కాగా పలు షాపింగ్ కాంప్లెక్స్‌లు జలమయమయ్యాయి. భక్తులు షెడ్ల కింద తల దాచుకోవాల్సి వచ్చింది. మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు.