Page Loader
Ayodhya Ram Mandir: అయోధ్యలో అలర్ట్‌.. రామ మందిర ట్రస్టుకు బెదిరింపు మెయిల్‌
అయోధ్యలో అలర్ట్‌.. రామ మందిర ట్రస్టుకు బెదిరింపు మెయిల్‌

Ayodhya Ram Mandir: అయోధ్యలో అలర్ట్‌.. రామ మందిర ట్రస్టుకు బెదిరింపు మెయిల్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2025
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు ఇటీవల ఒక అనుమానాస్పద ఈ-మెయిల్‌ వచ్చింది. ఇందులో రామాలయ భద్రతపై హెచ్చరికలు ఉండటంతో ట్రస్ట్‌ సర్వత్రా అప్రమత్తమైంది. మెయిల్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించిన ట్రస్ట్‌తో పాటు భద్రతా సంస్థలు, జిల్లా పోలీసు పరిపాలన బృందం కూడా రంగంలోకి దిగాయి. ఈ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే కోణాల్లో అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్‌లో రామాలయంపై బెదిరింపులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక పోలీసులు, నిఘా సంస్థలు సంఘటితంగా చర్యలు తీసుకుంటున్నాయి. భద్రతా ఏర్పాట్లను మరింత కఠినంగా మార్చారు. ప్రాథమిక దర్యాప్తులో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపినట్లు సమాచారం లభించింది.

Details

గతంలోనూ బెదిరింపులు

ఇది కొత్త పరిణామం కాదు. రామాలయంపై గతంలోనూ అనేక బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 2024 సెప్టెంబర్‌లో రామాలయంపై బాంబు దాడి చేస్తామనే బెదిరింపు మెయిల్‌ వచ్చింది.అప్పట్లోనూ ఇదే తరహాలో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ తరహా ఉగ్ర ముప్పుల దృష్ట్యా అయోధ్య నగరంలో భద్రతను బలపరిచారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు, ఆలయం చుట్టూ అనేక భద్రతా పాయింట్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు మొత్తం ప్రాంతాన్ని డ్రోన్‌ నిఘాలోకి తీసుకొచ్చారు.

Details

గోడ నిర్మాణ ప్రారంభం

ఎలాంటి అనుమానాస్పద కదలికలైనా వెంటనే గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంతేకాదు, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ఆలయ భద్రత కోసం దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న భద్రతా గోడ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఈ గోడ నిర్మాణాన్ని ఇంజినీర్ ఇండియా లిమిటెడ్‌ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ గోడ నిర్మాణం 18 నెలల్లో పూర్తి కానుందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనతో రామాలయ భద్రతపై మరోసారి చర్చ మొదలైందని చెప్పవచ్చు. కాగా ఈ బెదిరింపు మెయిల్‌కు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.