LOADING...
Andhra Pradesh Govt: డిసెంబర్ నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోకి.. నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు..!
డిసెంబర్ నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోకి.. నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు..!

Andhra Pradesh Govt: డిసెంబర్ నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోకి.. నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 'మనమిత్ర' వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి అన్ని సేవలు వస్తే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం పలు అంశాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 1,035 సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.

వివరాలు

వాట్సప్ గవర్నెన్స్ వినియోగంపై శిక్షణ

ఈ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలను వినియోగించుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 24 లక్షల మందికి పైగా వాట్సప్ గవర్నెన్స్ వినియోగంపై శిక్షణ అందించినట్లు తెలిపారు. ఇక కర్నూలు జిల్లాలో రూపుదిద్దుకుంటున్న డ్రోన్ సిటీ ఫేజ్-1 అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఎనిమిది కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యిందని, మే రెండో వారంలో అవి గ్రౌండ్ అవుతాయని తెలిపారు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారైన నేపథ్యంలో, జూలై నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.

వివరాలు

ప్రజలకు అవగాహన కల్పించాలి

దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు, వినియోగం జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, మిస్సింగ్ కేసుల ట్రేసింగ్, వాహన దొంగతనాల పరిష్కారం వేగవంతమైందని తెలిపారు. అయితే సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన కెమెరాల డేటాను కూడా సమన్వయం చేయాలని, ప్రజల్లో దీనిపై అవగాహన పెంచాలని సీఎం సూచించారు.

Advertisement

వివరాలు

శాటిలైట్ డేటాను వినియోగించేలా కార్యాచరణ

అదే విధంగా సీసీ కెమెరాలతో పాటు శాటిలైట్ డేటాను వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. శాటిలైట్ సమాచారాన్ని ఆర్టీజీఎస్‌కు అనుసంధానించి తక్షణ చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇటీవల తిరుమల-తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం వంటి ఘటనలపై మరింత వేగంగా స్పందించే వ్యవస్థ అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. డీజిల్, పెట్రోలు సరఫరా విషయంలో ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, ఇలాంటి సమస్యలు ముందుగానే గుర్తించి రియల్ టైమ్‌లో స్పందించే వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement